IPL 2021 MI VS CSK : మేటి కెప్టెన్ల సమరం... రోహిత్ కి అసలైన పరీక్ష

By team teluguFirst Published Sep 19, 2021, 12:22 PM IST
Highlights

ఐపీఎల్‌ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లు ఎం.ఎస్‌ ధోని, రోహిత్‌ శర్మల నాయకత్వం లేకుండా చెన్నై, ముంబయి విజయాలను ఊహించలేము. 

కోవిడ్‌-19 కేసులు, మానసిక ఆందోళన భారత్‌, ఇంగ్లాండ్‌ మాంచెస్టర్‌ టెస్టు రద్దుకు దారి తీసింది. భద్రతా కారణాలు, ఆటగాళ్ల భద్రతపై ఆందోళన పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ వైట్‌ బాల్‌ సిరీస్‌ను రద్దు చేసింది.

గత వారం రోజుల్లో ప్రపంచ క్రికెట్‌కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఊహించని రీతిలో ఆసక్తికర సమరాలకు చెక్‌ పడింది. రద్దు పరంపరను పక్కకునెడుతూ.. అభిమానుల ముందు మరోసారి ఐపీఎల్‌ వచ్చేసింది. 

చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ పోరుతో ఐపీఎల్‌ 14 సీజన్‌ నేడు పునః ప్రారంభం కానుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లు ఎం.ఎస్‌ ధోని, రోహిత్‌ శర్మ.

ఏకంగా ఐదు ఐపీఎల్‌ టైటిళ్లలో ముంబయి ఇండియన్స్‌ తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది. అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరుకున్న ఘనత సూపర్‌ కింగ్స్‌ సొంతం. ఎం.ఎస్‌ ధోని, రోహిత్‌ శర్మ నాయకత్వం లేకుండా చెన్నై, ముంబయి విజయాలను ఊహించలేము. 

కెప్టెన్సీలో ధోని నిజమైన వారసుడిగా రోహిత్‌ నిలిచాడు. ఈ ఇద్దరు ఐపీఎల్‌లో ముఖాముఖి తలపడినప్పుడు అభిమానులకు పండుగే. ఐపీఎల్‌లో చివరగా చెన్నై, ముంబయి మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠకు దారితీసింది.

కీరన్‌ పొలార్డ్‌ నమ్మశక్యం కాని హిట్టింగ్‌ ముంబయిని గెలుపు తీరాలకు చేర్చింది. ఏడు మ్యాచుల్లో సూపర్‌కింగ్స్‌ ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించగా.. ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలతో ముంబయి 8 పాయింట్లతో కొనసాగుతోంది. ఛేదనకు అనువైన దుబాయిలో నేడు ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. 

ప్లేయర్స్ తో సతమతం... 

ఐపీఎల్‌ 14 సీజన్‌ పునః ప్రారంభ మ్యాచ్‌కు ఇరు జట్లు తుది జట్టు ఎంపికలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సీజన్‌ను నెమ్మదిగా మొదలుపెట్టడం ముంబయి శైలి. ద్వితీయార్థంలో చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ముంబయి ఈసారి ఆరంభం నుంచీ టాప్‌గేర్‌లోనే ఆడాల్సి ఉంటుంది. క్వారంటైన్‌లో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరణ్‌, గాయం నుంచి పూర్తిగా కోలుకోని డుప్లెసి నేడు సెలక్షన్‌కు అందుబాటులో లేరు. 

డ్వేన్‌ బ్రావో కరీబియన్‌ లీగ్‌లోనూ బౌలింగ్‌ బాధ్యత తీసుకోలేదు. దీంతో చెన్నై విదేశీ ఆటగాళ్ల ఎంపికపై ఆసక్తి నెలకొంది. ముంబయి ఇండియన్స్‌ సైతం విదేశీ ఆటగాళ్ల ఎంపికలో డైలామా చూపిస్తోంది. ది హండ్రెడ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆడమ్‌ మిల్నేను తుది జట్టులోకి తీసుకునే అంశంపై నేడు తుది నిర్ణయం తీసుకోనుంది. 

గెలుపు స్ట్రాటజీ... 

ఎడమ చేతి బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా ఉన్న జట్లపై ఆఫ్‌స్పిన్నర్‌ జయంత్‌ యాదవ్‌ను ప్రయోగించటం ముంబయి వ్యూహం. మోయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజాల రూపంలో లెఫ్ట్‌ హ్యాండర్లు ఉన్న సూపర్‌కింగ్స్‌పై జయంత్‌ను బరిలోకి దింపనుంది ముంబయి.

రాహుల్‌ చాహర్‌కు తోడుగా జయంత్‌ను ఆడిస్తారా? ఇద్దరినీ జట్టులో కొనసాగిస్తారా? అనేది తేలాలి. ఐపీఎల్‌ 13లో సిక్సర్ల వర్షం కురిపించిన ముంబయి ఇండియన్స్‌.. ఈ సీజన్‌లో సిక్సర్ల రేసులో వెనుకంజలో ఉంది. ఏడు మ్యాచుల్లో 32 సిక్సర్లే బాదింది. హైదరాబాద్‌తో కలిసి ఈ జాబితాలో చివరి స్థానంలో ఉంది. సూపర్‌కింగ్స్‌ 62 సిక్సర్లతో జాబితాలో ముందుంది. చిన్న బౌండరీల దుబాయిలో ముంబయి బిగ్‌ హిట్టర్లు గణాంకాలు సవరించే అవకాశం లేకపోలేదు.

click me!