స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023 ను టీమిండియా ఆసిస్ పై విజయంతో ప్రారంభించినప్పటికీ టాపార్డర్ బ్యాటర్ల ప్రదర్శన కలవరపెడుతోంది.
చెన్నై : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ను భారత్ విజయంతో ప్రారంభించింది. ఆదివారం చెన్నై స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ తో పాటు ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ తడబడ్డారు. బౌలర్ల దాటికి ఇరుజట్ల టాపార్డర్ బెంబేలెత్తిపోయింది. చివరకు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, యువ ఆటగాడు కేఎల్ రాహుల్ ఆసిస్ బౌలర్లతో పోరాడి భారత్ ను విజయతీరాలకు చేర్చారు. ఇది లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికి ఉత్కంఠభరితంగా సాగింది.
ఆసిస్ పై విజయం సాధించినప్పటికీ టీమిండియా ఖాతాలో ఓ చెత్త రికార్డ్ చేరింది. పరుగులేమీ సాధించకుండానే వరుసగా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు డకౌట్ అవడం టీమిండియా వన్డే చరిత్రలోనే ఇది మొదటిసారి. అంతేకాదు ఇద్దరు ఓపెనర్లు డకౌట్ అవడం వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇది ఏడోసారి. ఇలా ఆసిస్ పై విజయాన్ని రోహిత్ సేన, క్రికెట్ ఫ్యాన్స్ ఆస్వాదించనివ్వకుండా చేస్తున్నాయి ఈ చెత్త రికార్డులు.
undefined
2004 లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో భారత ఓపెనర్లు డకౌట్ అయ్యారు. ఇదే చివరిసారి. ఆ తర్వాత ఇప్పటివరకు వన్డేల్లో ఓపెనర్లిద్దరు పరుగులు సాధించకుండానే వెనుదిరిగిన సందర్భాలు లేవు. తాజాగా ప్రపంచ కప్ 2023 లో ఆడిన తొలి మ్యాచ్ లోనే టీమిండియా ఓపెనర్లు ఆనాటి చెత్త ప్రదర్శనను పునరావృతం చేసారు.
భారత్-ఆసిస్ మ్యాచ్ సాగిందిలా...
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లను భారత బౌలర్లు కంగారెత్తించారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలం ముందు ఆసిస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. వీరికి బుమ్రాతో పాటు మిగతా బౌలర్లు తోడవడంతో ఆసిస్ కేవలం 199 పరుగులకే కుప్పకూలింది. వార్నర్, స్మిత్ మధ్యలో కొద్దిసేపు వికెట్ పడకుండా అడ్డుపడటంతో ఆసిస్ ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది.
200 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను కూడా ఆసిస్ బౌలర్లు ఆదిలోనే దెబ్బతీసారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తో పాటు శ్రేయాస్ అయ్యర్ ను పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు పంపించారు. ఇలా ఆసిసి బౌలర్లు స్టార్క్, హజిల్ వుడ్ దాటికి నిలవలేక ముగ్గురు భారత టాపార్డర్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు. కానీ విరాట్ కోహ్లీ (85 పరుగులు), కేఎల్ రాహుల్ (97 పరుగులు) అద్భుతంగా ఆడి టీమిండియాను విజయతీరాలను చేర్చారు.