
శ్రీలంకలోని కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియంలో అక్టోబర్ 2న జరిగిన పాకిస్తాన్ – బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సనా మీర్ కామెంట్రీలో భాగంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె పాకిస్తాన్ ఆటగాళ్లలో ఒకరైన నటాలియా పర్వేజ్‌ను "ఆజాద్ కాశ్మీర్" నుంచి వచ్చిన ప్లేయర్ అని పేర్కొనడం వివాదానికి దారి తీసింది.
29 ఏళ్ల నటాలియా పర్వేజ్ వాస్తవానికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని భింబర్ జిల్లా, బండాలా ప్రాంతానికి చెందింది. అక్కడి నుంచి ఆమె లాహోర్‌కి వెళ్లి ఎక్కువగా క్రికెట్ ఆడుతుంది. సనా మీర్ మాట్లాడుతూ.. “అవును, వీరు క్వాలిఫయర్స్ గెలిచారు. కానీ ఈ ఆటగాళ్లలో చాలామంది కొత్తవారు. నటాలియా కాశ్మీర్ నుంచి వచ్చి, ఎక్కువ క్రికెట్ లాహోర్‌లో ఆడుతుంది. జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆమె తరచూ లాహోర్ రావాల్సిందే” అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. సనా మీర్ ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరిన మొదటి పాకిస్తానీ మహిళా క్రికెటర్‌గా పేరు గాంచారు. దీంతో ఆమె వ్యాఖ్యలు మరింతగా చర్చనీయాంశమయ్యాయి.
అక్టోబర్ 5న కొలంబోలో జరగబోయే భారత్ – పాకిస్తాన్ మహిళల వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు ఈ వివాదం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఇప్పటికే భారత మహిళా జట్టుకు పాకిస్తాన్ ఆటగాళ్లతో “నో హ్యాండ్‌షేక్ పాలసీ” కొనసాగించాలని సూచించింది.
ఈ విషయమై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. “భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుంది. అన్ని క్రికెట్ నియమాలు పాటిస్తాం. హ్యాండ్‌షేక్ లేదా హగ్ ఉంటాయా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ క్రికెట్ మాన్యువల్ ప్రకారం ఉన్న నియమాలు మాత్రమే అమలు అవుతాయి” అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ఆసియా కప్ సమయంలో కూడా భారత పురుషుల జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అదేవిధంగా పాకిస్తానీ అధికారుల నుంచి ట్రోఫీ, మెడల్స్ తీసుకోవడానికి కూడా నిరాకరించింది. ఈ అంశం ప్రపంచ క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.