
IND vs WI : వెస్టిండీస్ జట్టు భారత పర్యటనలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆడుతోంది. ఇందులో మొదటి మ్యాచ్ ఈరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు, భారత బౌలింగ్‌ను తట్టుకోలేక కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది.
వెస్టిండీస్ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఆట నాలుగో ఓవర్లో సిరాజ్ బౌలింగ్‌లో చందర్‌పాల్ (0) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జామ్ క్యాంప్‌బెల్ (8) బుమ్రా వేగానికి పెవిలియన్ చేరాడు. బ్రాండన్ కింగ్ (13), అలిక్ అథనేజ్ (12) కూడా సిరాజ్ బౌలింగ్‌లో ఔటవడంతో వెస్టిండీస్ 42/4తో కష్టాల్లో పడింది.
ఆ తర్వాత కెప్టెన్ రోస్టన్ చేజ్, షాయ్ హోప్ కలిసి జట్టును కొంతవరకు ఆదుకున్నారు. బాగా ఆడుతున్న షాయ్ హోప్ (26) కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పుడు జట్టు స్కోరు 90/5. ఆ తర్వాత వెస్టిండీస్ జట్టు పతనం నుంచి కోలుకోలేకపోయింది. కెప్టెన్ రోస్టన్ చేజ్ (24), కారీ పియర్ (11) వరుసగా ఔటయ్యారు.
చివర్లో జస్టిన్ గ్రీవ్స్ (32 పరుగులు) అద్భుతంగా ఆడి జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. వెస్టిండీస్ జట్టు 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. తన అద్భుతమైన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన మహ్మద్ సిరాజ్ 14 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. యార్కర్లతో భయపెట్టిన జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు.
భారత జట్టు బౌలింగ్ చాలా నాణ్యంగా ఉంది. పిచ్‌పై మంచి బౌన్స్ ఉన్నప్పటికీ, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై బుమ్రా, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోంది.