
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న భారత్ - వెస్టిండీస్ పోరులో భారత బౌలర్లు రాణించారు. టీమిండియా బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు నిలువలేకపోయారు. దీప్తి శర్మ తో పాటు పూజా వస్త్రకార్, రేణుకా సింగ్ ఠాకూర్ లు రాణించారు. భారత బౌలర్ల ధాటికి విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయానికి 20 ఓవర్లలో 120 పరుగులు చేయాల్సి ఉంది.
టాస్ గెలిచిన వెస్టిండీస్‌కు రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. పూజా వస్త్రకార్ వేసిన విండీస్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే కెప్టెన్ హీలి మాథ్యూస్ (2) వికెట్ రిచా ఘోష్ చేతికి చిక్కింది. తొలి పవర్ ప్లేలో వెస్టిండీస్.. 29 పరుగులే చేసింది.
వన్ డౌన్ లో వచ్చిన షమైన్ క్యాంప్‌బెల్ (30) తో కలిసి స్టెఫానీ టైలర్ (40 బంతుల్లో 42, 6 ఫోర్లు) రాణించింది. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 73 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా పరిగణిస్తున్న ఈ జోడీని దీప్తి శర్మ విడదీసింది. దీప్తి వేసిన 13.3 వ ఓవర్ లో షమైన్ ఇచ్చిన క్యాచ్ ను స్మృతి మంధాన అందుకుంది.
షమైన్ నిష్క్రమించడంతో విండీస్ త్వరత్వరగా మరో రెండు వికెట్లు కోల్పోయింది. స్టెఫానీని కూడా దీప్తి వేసిన అదే ఓవర్లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూ ద్వారా నిష్క్రమించింది. తర్వాతి ఓవర్లో చినెల్లె హెన్రీ (2) కూడా రనౌట్ అయింది. దీంతో 76-1గా ఉన్న వెస్టిండీస్ జట్టు రెండు ఓవర్ల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది.
దేవికా వేసిన 17 వ ఓవర్లో చెడీన్ నేషన్ (18 బంతుల్లో 21, నాటౌట్, 1 ఫోర్), షబికా గజ్నాబి (15) లు చెరో ఫోర్ కొట్టారు. కానీ ఆమె.. రేణుకా సింగ్ ఠాకూర్ వేసిన 18వ ఓవర్ చివరి బంతికి క్లీన్ బౌల్డ్ అయింది. దీప్తి శర్మ వేసిన చివరి ఓవర్లో రెండో బంతికి అఫి ఫ్లెచర్ డకౌట్ అయింది. ఈ మ్యాచ్ లో ఆమెకు ఇది మూడో వికెట్. మొత్తంగా టీ20లలో ఇది ఆమెకు వందో వికెట్ కావడం గమనార్హం. మరి మాజీ ఛాంపియన్లను బౌలింగ్ లో నిలువరించిన భారత్.. బ్యాటింగ్ లో కూడా అదే తెగువను చూపగలదా..? అనేది వేచి చూడాలి.