వుమెన్స్ టీ20 ఛాలెంజ్: ‘సూపర్’ బోణీ... హర్మన్‌ప్రీత్ టీమ్‌ చేతుల్లో మంధాన టీమ్ చిత్తు...

By Chinthakindhi RamuFirst Published May 23, 2022, 11:04 PM IST
Highlights

ట్రైయిల్‌బ్లేజర్స్‌పై 49 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న సూపర్‌నోవాస్... 4 వికెట్లు తీసిన పూజా వస్త్రాకర్... 

వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో సూపర్ నోవాస్ టీమ్ బోణీ కొట్టింది. ట్రైయిల్‌బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది సూపర్ నోవాస్. 164 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ట్రైయిల్ బ్లేజర్స్.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 114 పరుగులు మాత్రమే చేయగలిగింది ...

హేలీ మాథ్యూస్ 18 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ సృతి మంధాన 23 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. జెమీమా రోడ్రిగ్స్ 21 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేయగా సోఫియా డంక్లే 1, రిచా ఘోష్ 2 పరుగులు చేయగా షర్మీన్ అక్తర్, అరుంధతి రెడ్డి, సల్మా ఖటూన్ డకౌట్ అయ్యారు...

పూనమ్ యాదవ్ 7 పరుగులు చేయగా రేణుకా సింగ్ 14, రాజేశ్వరి గైక్వాడ్ 7 కలిసి ట్రైయిల్‌బ్లేజర్స్ స్కోరు 100 మార్కుకి దాటించగలిగారు... అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మొదటి ఓవర్ నుంచే దూసుకు కొనసాగించారు ఓపెనర్లు. 17 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన డియాండ్రా డాటిన్ రనౌట్ కావడంతో 50 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సూపర్ నోవాస్...

20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన ప్రియా పూనియా, హేలీ మాథ్యూస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా... 19 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేసిన హర్లీన్ డియోల్, సల్మా ఖటూన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరింది...

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 29 బంతుల్లో 4 ఫోర్లతో 37 పరుగులు చేసి రనౌట్ కాగా సునీ లూజ్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసింది. అలెనా కింగ్ 5 పరుగులు చేసి అవుట్ కాగా పూజా వస్త్రాకర్ 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసింది...

ఆఖరి ఓవర్‌లో సోఫీ ఎక్లే‌స్టోన్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన హేలీ మాథ్యూస్, వీ చందూనీ కూడా ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చింది. మేఘనా సింగ్‌ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరింది. 

18.3 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసిన సూపర్ నోవాస్, ఆఖరి 9 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 8 పరుగులు మాత్రమే చేయగలిగింది.. ఆఖరి 5 ఓవర్లలో 40 పరుగులు రాగా 6 వికెట్లు కోల్పోయింది హర్మన్‌ప్రీత్ టీమ్... 

click me!