
ఒకప్పుడు మంచినీళ్లు తాగిన ప్రాయంగా శతకాల మీద శతకాలు బాదిన పరుగుల యంత్రం విరాట్ కోహ్లి గత కొంతకాలంగా ఆ దూకుడు చూపడం లేదు. క్రీజులోకి వచ్చిందంటే మినిమమ్ హాఫ్ సెంచరీ పక్కా.. ఒకవేళ ఛేదనలో అయితే సెంచరీ చేసేదాకా తగ్గేదేలే.. అన్నట్టుగా ఆడిన కోహ్లి.. ఇప్పుడు క్రీజులో నిలిస్తే అదే పదివేలు అన్నంతగా మారిపోయాయి పరిస్థితులు. ఒకప్పుడు షర్ట్ బటన్ మార్చినంత ఈజీగా సెంచరీలు చేసిన కింగ్ కోహ్లి.. చివరి శతకం చేసి 28 నెలలు కావస్తున్నది. 2019 ఆగస్టులో ఈడెన్ గార్డెన్ లో బంగ్లాదేశ్ పై చేసిన శతకమే కోహ్లి చివరి శతకం.
వన్డే, టెస్టులలో కలిపి ఇప్పటిదాకా 70 శతకాలు చేసిన కోహ్లి.. మరో సెంచరీ చేస్తే ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ రికీ పాంటింగ్ సరసన నిలుస్తాడు. కోహ్లి శతకం కోసం అతడి అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ కూడా కండ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లి గనుక నూరో టెస్టులో సెంచరీ చేస్తే పలువురు క్రికెట్ దిగ్గజాల సరసన చేరనున్నాడు.
నూరో టెస్టులో సెంచరీ చేసిన ఆటగాళ్లు వీరే..
మొహాలీలో లంకతో జరుగబోయే తొలిటెస్టు కోహ్లికి కెరీర్ లో నూరో టెస్టు. ఈ టెస్టులో గనక అతడు సెంచరీ సాధిస్తే అది చరిత్రే కానుంది. ఎందుకంటే తమ వందో టెస్టులో సెంచరీ చేసిన క్రికెటర్లు కొద్దిమందే.. ఈ జాబితాలో ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా), జో రూట్ (ఇంగ్లాండ్), జావేద్ మియాందాద్ (పాకిస్థాన్), గ్రీనిడ్జ్ (వెస్టిండీస్), అలెక్ స్టీవర్ట్ (ఇంగ్లాండ్), ఇంజమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్), హషీమ్ అమ్లా (దక్షిణాఫ్రికా) కొలిన్ కౌడ్రే (ఇంగ్లాండ్) ఉన్నారు.
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి వందో టెస్టు ఆడిన ఇంగ్లాండ్ ఆటగాడు కొలిన్ కౌడ్రే.. తన నూరో టెస్టులో సెంచరీ (ఆసీస్ పై) చేశాడు. ఇక రికీ పాంటింగ్ కూడా తన వందో టెస్టులో దక్షిణాఫ్రికాపై రెండు వరుస ఇన్నింగ్స్ లలో రెండు సెంచరీలు బాదాడు. ఇంగ్లాండ్ సారథి జో రూట్ కూడా వందో టెస్టులో డబుల్ సెంచరీ (ఇండియా మీద) సాధించాడు. కాగా ఒకవేళ మొహాలీలో కోహ్లి సెంచరీ చేస్తే అతడు ఈ దిగ్గజాల సరసన నిలువనున్నాడు.
మరో 38 పరుగులు చేస్తే..
కోహ్లి సెంచరీతో పాటు మరో రికార్డు కూడా అతడిని ఊరిస్తున్నది. ఇప్పటివరకు 99 టెస్టులాడిన కోహ్లి.. 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. అతడు మరో 38 పరుగులు చేస్తే 8 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు.
భారత్ తరఫున వంద టెస్టులు ఆడిన క్రికెటర్లు :
- సచిన్ టెండూల్కర్ (200 టెస్టులు)
- రాహుల్ ద్రావిడ్ (163 టెస్టులు)
- వీవీఎస్ లక్ష్మణ్ (134 టెస్టులు)
- అనిల్ కుంబ్లే (132 టెస్టులు
- కపిల్ దేవ్ (131 టెస్టులు)
- సునీల్ గవాస్కర్ (125 టెస్టులు)
- వెంగ్సర్కార్ (116 టెస్టులు)
- ఇషాంత్ శర్మ (105 టెస్టులు)
- హర్భజన్ సింగ్ (103 టెస్టులు)
- వీరేంద్ర సెహ్వాగ్ (103 టెస్టులు)
- మహ్మద్ అజారుద్దీన్ (99 టెస్టులు)
- విరాట్ కోహ్లి (99 టెస్టులు)
అతడు సాధిస్తాడు : సునీల్ గవాస్కర్
నూరో టెస్టులో కోహ్లి శతకం కొడతాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. కోహ్లి వందో టెస్టు నేపథ్యంలో అతడు మాట్లాడుతూ.. ‘వందో టెస్టులో అతడు శతకం బాదుతాడని నేను నమ్ముతున్నాను. చాలా మంది ఆటగాళ్లు వంద టెస్టులు ఆడినా ఆ ఫీట్ ను మాత్రం చాలా తక్కువ మంది సాధించారు. ఆ జాబితాలో కోహ్లి చేరుతాడని ఆశిస్తున్నా..’ అని చెప్పుకొచ్చాడు. మరి అతడి అభిమానులు, టీమిండియా ఫ్యాన్స్, దిగ్గజ క్రికెటర్లు కోరుకుంటున్నట్టుగా కోహ్లి శతక కరువును తీరుస్తాడా..? లేక మళ్లీ నిరాశపరుస్తాడా..? అనేది రెండ్రోజుల్లో తేలనుంది.