
అసలే రాక రాక పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. అసలు ఈ సిరీస్ ఏమేర విజయవంతమవుతుంది..? అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్ ఆస్టన్ అగర్ కు ఓ ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు భద్రత పెంచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. పాక్ బౌలర్.. ఆ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న హరిస్ రౌఫ్ కరోనా బారిన పడ్డాడు. రావల్పిండి వేదికగా ఈనెల 4 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో రౌఫ్ కు కరోనా పాజిటివ్ సోకడం గమనార్హం.
1998 తర్వాత.. 24 ఏండ్ల అనంతరం తమ దేశానికి వచ్చిన ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడాలని పట్టుదలగా ఉన్న పాక్ కు ఏదీ కలిసిరావడం లేదు. తొలి టెస్టుకు సరిగ్గా రెండ్రోజుల ముందు ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ హరిస్ రౌఫ్ కు కరోనా నిర్ధారణ అయింది. దీంతో అతడు క్వారంటైన్ కు వెళ్లాడు. అతడితో పాటు సన్నిహితంగా మెలిగిన పాకిస్థాన్ తురుపుముక్క షాహీన్ షా అఫ్రిది కూడా ఐసోలేషన్ కు వెళ్లాడు.
ట్రోఫీ అందించారు.. కరోనా అంటించుకున్నారు..
హరిస్ రౌఫ్ కు కరోనా సోకడం అతడి స్వయంకృతాపరాధమే అంటున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్. ఇటీవలే ముగిసిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 2022)లో షాహీన్ నేతృత్వం వహిస్తున్న లాహోర్ ఖలందర్స్ జట్టు ఫైనల్ లో ముల్తాన్ సుల్తాన్స్ ను ఓడించి ట్రోపీ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ట్రోఫీ నెగ్గిన తర్వాత ఆ జట్టు ఆటగాళ్లు.. సంబురంగా ఆ జట్టు కోచ్ అకిబ్ జావేద్ కు అందజేయడానికి వెళ్లారు. కరోనా సోకడంతో అతడు ఓ హోటల్ గదిలో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. జావేద్ దగ్గరికి వెళ్లిన లాహోర్ ఆటగాళ్ల లో అఫ్రిది తో పాటు రౌఫ్ కూడా ఉన్నారు.
కాగా అకిబ్ కు ట్రోపీ అందించిన తర్వాత అతడు దానిని ముద్దాడాడు. తిరిగి ఆ ట్రోఫీని రౌఫ్ చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ తతంగమంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఏ ఒక్క ఆటగాడు కూడా ముఖానికి మాస్క్ ధరించకపోవడం గమనార్హం. వాళ్లు చేసిన తప్పులకు తిక్క కుదిరింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే రౌఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
పగబట్టిన ప్రకృతి..?
ఇదిలాఉండగా.. ఆటగాళ్లు, కరోనా విషయం కాస్త పక్కనబెడితే తొలి టెస్టుకు వాతావరణం కూడా సహకరించేది అనుమానమే.. రావల్పండిలో రాబోయే నాలుగైదు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తొలి రెండు రోజులు ఆకాశ మేఘావృతమై ఉన్నా మూడు, నాలుగో రోజుల్లో ఆట సాధ్యమవడం గగనమే అంటున్నారు వాతావరణ నిపుణులు.. ఆట చివరి మూడు రోజుల్లో వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం.