
ఒకప్పుడు క్రికెట్ అంటే సచిన్ టెండుల్కర్.. సచిన్ అంటే క్రికెట్ లా ఉండేది. ఇప్పటికీ ఆయనను క్రికెట్ దేవుడుగా భావిస్తూ ఉంటారు. ఆయనకు వివిధ దేశాల్లో అభిమానులు ఉన్నారు. సచిన్ నచ్చని వారు చాలా అరుదు అనే చెప్పాలి. ఆయన పేరిట చాలా రికార్డులు ఉన్నాయి. కాగా.. 2013లో సచిన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ రిటైర్మెంట్.. భారత క్రికెట్ అభిమానులకు చాలా ఎమోషనల్ మూమెంట్ అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులు మాత్రమే కాదు... అతని యువ సహచరులకు కూడా సచిన్ ఆదర్శంగా నిలిచాడు. ఆ సమయంలో.. విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభంలో ఉన్నాడు.
కాగా.. ఆ సమయంలో సచిన్ కి.. విరాట్ కోహ్లీ ఓ మధురమైన బహుమతిని ఇచ్చాడట. అయితే.. ఆ బహుమతిని కొంత కాలం తన దగ్గరే ఉంచుకొని.. ఆ తర్వాత తిరిగి ఇచ్చేశానని సచిన్ చెప్పాడు. ఆ సమయంలో తాను చాలా ఎమోషనల్ అయ్యానని సచిన్ చెప్పాడు.
ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ కొన్నేళ్ల క్రితం అమెరికా జర్నలిస్టు గ్రాహం బెన్‌సింగర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రస్తుతం సచిన్ కూడా అదే జర్నలిస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ ఇచ్చిన ఆ బహుమతి తనను భావోద్వేగానికి గురిచేసిందని చెప్పాడు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ సచిన్ ఇలా అన్నాడు.
“నేను డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక మూలన నా కన్నీళ్లను తుడుచుకుంటున్నాను. ఆ సమయంలో విరాట్ నా దగ్గరకు వచ్చి తన తండ్రి ఇచ్చిన పవిత్రమైన ఎర్రటి దారాన్ని ఇచ్చాడు. నేను దానిని కొంతకాలం నా వద్ద ఉంచుకున్నాను. దానిని తిరిగి విరాట్‌కి ఇచ్చాను. ఇది అమూల్యమైనది. అది మీతో ఉండాలని నేను చెప్పాను. ఇది మీ ఆస్తి. ఇది మీ చివరి శ్వాస వరకు మీ వద్ద ఉండాలని తెలిపాను. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్, ఇది ఎప్పటికీ నా జ్ఞాపకంలో నిలిచిపోతుంది” అని ఆన పేర్కొన్నారు.