అప్పుడు ఆంబ్రోస్ రికార్డు ... మళ్లీ 26 ఏళ్లకు విండీస్ బౌలర్ ఘనత

By Siva KodatiFirst Published Jul 25, 2020, 8:38 PM IST
Highlights

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ బౌలర్ కీమర్ రోచ్ అరుదైన ఘనత సాధించాడు. శనివారం క్రిస్ వోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రోచ్.. తన ఖాతాలో 200వ టెస్ట్ వికెట్‌ను జమ చేసుకున్నాడు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ బౌలర్ కీమర్ రోచ్ అరుదైన ఘనత సాధించాడు. శనివారం క్రిస్ వోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రోచ్.. తన ఖాతాలో 200వ టెస్ట్ వికెట్‌ను జమ చేసుకున్నాడు.

తద్వారా విండీస్ తరపున ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 1994లో విండీస్ దిగ్గజ బౌలర్.. కర్ట్‌లీ ఆంబ్రోస్ తర్వాత 26 ఏళ్లకు రోచ్ ఈ ఘనత సాధించడం విశేషం.

ఈ సందర్భంగా ఆంబ్రోస్.. రోచ్‌ను అభినందిస్తూ వీడియో సందేశం పంపాడు. నువ్వు ఇలాగే కొనసాగుతూ.. రాబోయే రోజుల్లో 250, 300 వికెట్లు తీయాలని ఆయన ఆకాంక్షించాడు. రోచ్ 59 టెస్టుల్లోనే ఈ ఘనత అందుకోవడం విశేషం.

ఇందులో తొమ్మిదిసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. తొలి రోజు ఆటలో భాగంగా శుక్రవారం బౌలింగ్ చేసిన రోచ్.. డొమినిక్ సిబ్లీ, బెన్‌స్టోక్స్‌లను పెవిలియన్ చేర్చాడు. శనివారం వెలుతురు లేమి కారణంగా నిర్ణీత సమయం కంటే ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు.

ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఒల్లీపోప్ 91, జాస్ బట్లర్ 56 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, ఇంగ్లాండ్.. విండీస్‌లు ఇప్పటికే చెరో మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్‌ ఎవరు గెలిస్తే వాళ్లకే సిరీస్ సొంతమవుతుంది. 
 

click me!