Virat Kohli: విరాట్ రెస్టారెంట్లలో వాళ్లకు నో ఎంట్రీ.. వివక్ష చూపుతున్నారంటూ స్వలింగ సంపర్కుల ఆగ్రహం..

By team teluguFirst Published Nov 16, 2021, 5:37 PM IST
Highlights

YesWeExistIndia:టీమిండియా  సారథి విరాట్ కోహ్లి కి చెందిన రెస్టారెంట్లపై స్వలింగ సంపర్కులకు చెందిన ఓ సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ పట్ల వివక్ష చూపుతున్నారని, ఇది  ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని ఆరోపించింది. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫుడ్ బిజినెస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ, పూణె, కోల్కతా తో పాటు పలు భారతీయ నగరాల్లో కోహ్లికి చెందిన రెస్టారెంట్.. ‘వన్8 కమ్యూన్’కు  బ్రాంచులున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాదిరే కోహ్లి కూడా ఫుడ్ బిజినెస్ లో దిగి విజయవంతమవుతున్నాడు. అయితే తాజాగా విరాట్ కు చెందిన రెస్టారెంట్లపై స్వలింగ సంపర్కులు సంచలన ఆరోపణలు చేశారు. ఆ రెస్టారెంట్లకు తమను అనుమతించడం లేదని, ఇదేం  వివక్ష అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను మార్చాలని  విరాట్ ను కోరారు. 

అసలేం విషయంలోకి వెళ్తే..  Virat Kohliకి చెందిన One8 Commune లోని పూణె బ్రాంచ్ లోని సిబ్బంది స్వలింగ సంపర్కుల (ఎల్జీబీటీక్యూ) ను లోపలికి  అనుమతించలేదని ‘ఎస్ వి ఎగ్జిస్ట్’ (Yesweexistindia) ఆరోపణ. అక్కడకు వెళ్లిన తమవాళ్లను ఆ సిబ్బంది బయటకు పంపించారని, వారికి అనుమతి లేదని దురుసుగా ప్రవర్తించారని సమాచారం. తమకు ఎదురైన  చేదు అనుభవాన్ని ఆ గ్రూపు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తమ పట్ల వివక్ష చూపడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని  తెలిపింది. 

ఇదే విషయమై Yesweexistindia ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. ‘విరాట్ కోహ్లీ.. నీకు ఈ విషయం తెలియదనే అనుకుంటున్నాం. వన్8 కమ్యూన్ పూణె బ్రాంచ్ లో LGBTQIA గెస్టుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. మీ రెస్టారెంట్ లో మిగతా బ్రాంచీలు కూడా  ఇదే తరహాలో నడుస్తున్నాయి. ఇది మేము ఊహించలేదు.. అంతేగాక ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు.ఈ విషయం తెలిసిన తర్వాతనైనా మీరు నిబంధనలు మారుస్తారని ఆశిస్తున్నాం’ అని పోస్టు చేసింది. 

 

విరాట్ తో పాటు జొమాటోకు కూడా ఎస్ వి ఎగ్జిస్ట్ ఒక అభ్యర్థన చేసింది. ‘Zomatoకూ మా విజ్ఞప్తి. ఇలాంటి రెస్టారెంట్లతో మీరు జట్టు కట్టొద్దు..’ అంటూ పోస్టు షేర్ చేసింది. 

అయితే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాలు వెల్లువెత్తాయి. జెండర్ ఆధారంగా రెస్టారెంట్లలో ప్రవేశాలను అడ్డుకోవడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కోహ్లి స్పందించాలని  పలువురు డిమాండ్ చేశారు.  ఈ వివాదంపై పూణె బ్రాంచ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలని కొట్టిపారేశాడు.  తామెలాంటి లింగ వివక్ష చూపలేదని తెలిపాడు. అయితే మహిళల భద్రత దృష్ట్యా ఒంటరిగా వచ్చే అబ్బాయిలను మాత్రమే  లోపలికి అనుమతించడం లేదని స్పష్టం చేశాడు. మరి  ఈ ఆరోపణలపై కోహ్లి ఏ విధంగా స్పందిస్తాడోనని సామాజిక మాధ్యమాల్లో నెటిజనులు వేచి చూస్తున్నారు.

click me!