IPL 2022: భారత్ కు వరల్డ్ కప్ అందించిన కోచ్ పై కన్నేసిన ఆ ఫ్రాంచైజీ.. ఇండియా మాజీ పేసర్ తోనూ చర్చలు..

By team teluguFirst Published Nov 16, 2021, 4:46 PM IST
Highlights

Garry Kirsten-Ashish Nehra: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈసారి రెండు కొత్త జట్లు రాబోతున్న విషయం తెలిసిందే. లక్నో తో పాటు అహ్మదాబాద్ కూడా ఈసారి పోటీలలో పాల్గొనబోతున్నాయి. అయితే లక్నో ఫ్రాంచైజీ మాత్రం  ఐపీఎల్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి  ప్రణాళికలు రచిస్తున్నది.

సుమారు మూడు దశాబ్దాల అనంతరం మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని జట్టు టీమిండియాకు ప్రపంచకప్ అందించింది.  అయితే ఈ విజయంలో ధోని సేనకు  ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్స్టెన్ పాత్ర తక్కువేమీ కాదు. అతడి మార్గనిర్దేశనంలో భారత జట్టు స్వదేశంలోనే గాక విదేశీ గడ్డపై సంచలన విజయాలు సాధించింది.  నేడు భారత జట్టుకు ప్రధాన ఆటగాళ్లుగా ఉన్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి క్రికెటర్లంతా కిర్స్టెన్ మార్గనిర్దేశనంలో ఎదిగిన వాళ్లే. అయితే ఈ దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మెన్ మళ్లీ ఇండియాలోని ఓ జట్టుకు  కోచింగ్ బాధ్యతలను చేపట్టడానికి రాబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈసారి రెండు కొత్త జట్లు రాబోతున్న విషయం తెలిసిందే. లక్నో తో పాటు అహ్మదాబాద్ కూడా ఈసారి పోటీలలో పాల్గొనబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లకు సంబంధించిన బిడ్ కూడా ముగిసింది.  ఇక వచ్చే జనవరి మొదటివారంలో జరుగబోయే ఐపీఎల్ మెగావేలంలో ఈ జట్లు ఏ ఆటగాళ్లను దక్కించుకోనున్నాయో వేచి చూడాలి. అయితే.. లక్నో ఫ్రాంచైజీని దక్కించుకున్న  ప్రముఖ  వ్యాపారవేత్త సంజీవ్ గొయెంకా (ఆర్పీఎస్జీ)..  జట్టుకు హెడ్   కోచ్ గా గ్యారీ  కిర్స్టెన్  వస్తే బావుంటుందని కోరుకుంటున్నట్టు తెలుస్తున్నది. 

ఈ మేరకు ఆ  ఫ్రాంచైజీ ప్రతినిధులు ఇప్పటికే కిర్స్టెన్ తో సమావేశమైనట్టు  సమాచారం. అయితే దీనిపై అతడు  ఇంకా  తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది. కిర్స్టెన్ టీమిండియాకు 2008 నుంచి 2011 దాకా పని చేశాడు. ఆ తర్వాత అతడు దక్షిణాఫ్రికా కోచ్ గా నియమితుడయ్యాడు. ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్న్ గ్యారీ.. ఐపీఎల్ లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా  హెడ్ కోచ్ గా పనిచేశాడు. ఇక అతడు పాకిస్థాన్ హెడ్ కోచ్ పదవికి కూడా దరఖాస్తు చేసుకున్నట్టు గత నెలలో వార్తలు వచ్చాయి.  వచ్చే నెలలో దీనిపై పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

ఇదిలాఉండగా.. గ్యారీ తో పాటు టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా పై కూడా లక్నో ఫ్రాంచైజీ  సంప్రదించినట్టు సమాచారం. గ్యారీని హెడ్ కోచ్ గా.. నెహ్రాను కన్సల్టెంట్ గా తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ వేలం జరిగే లోపు దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా.. 2011  ప్రపంచకప్ నెగ్గిన జట్టులో నెహ్రా సభ్యుడు.. గ్యారీ కోచ్  గా ఉండటం గమనార్హం. 

కాగా.. ఐపీఎల్ లో లక్నో ఫ్రాంచైజీ  దక్కించుకోవడానికి ముందు సంజీవ్ గొయెంకా..  రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ కు యజమానిగా ఉన్నాడు. కానీ  ఆ జట్టుతో ఐపీఎల్ ఒప్పందం ముగియడంతో ఆయన మళ్లీ లక్నో కు బిడ్ వేశాడు. 2016, 2017 సీజన్ లో ఆ జట్టు ఐపీఎల్ లో ఆడింది. 2017 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఫైనల్లో ఓడింది. ఆ రెండేళ్లు పూణెకు స్టీఫెన్ ఫ్లెమింగ్ (న్యూజిలాండ్ మాజీ కెప్టెన్) కోచ్ గా పనిచేశాడు. అయితే ఈసారి ఐపీఎల్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సంజీవ్ గొయెంకా పకడ్బందీ ప్రణాళికలు వేస్తున్నాడు. లక్నో పై భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన ఆయన..  వచ్చే పదేండ్లలో  అది రెట్టింపు అవుతుందని భావిస్తున్నాడు. 

click me!