Hardik Pandya: అవన్నీ చట్టబద్ధంగా కొన్నవే.. ఎందుకు నామీద ఈ కక్ష.. క్లారిటీ ఇచ్చిన పాండ్య

By team teluguFirst Published Nov 16, 2021, 1:18 PM IST
Highlights

Hardik Pandya Luxury Watches: తనపై సోషల్ మీడియాలో జరుగుతున్నదంత దుష్ప్రచారమేనని టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా స్పష్టం చేశాడు. ఆ వాచీల విలువ రూ. 5 కోట్లు కాదని తెలిపాడు. 

టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య వద్ద ముంబై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు అత్యంత విలువైన  వాచీలను సీజ్ చేశారని, వాటి విలువ  సుమారు రూ. 5 కోట్లు పైన ఉంటుందని వస్తున్న వార్తలను అతడు ఖండించాడు. తాను ఏ తప్పు చేయకున్నా  కొంత మంది తనపై కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలను ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను చట్టాన్ని గౌరవించే దేశ పౌరుడినని, సంబంధిత  చేతి గడియారాలకు పూర్తి రశీదులు అధికారులకు చూపించానని స్పష్టం చేశాడు. నేటి ఉదయం నుంచి Hardik Pandyaపై వస్తున్న ఆరోపణలపై అతడు  సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చాడు. 

ట్విట్టర్ వేదికగా స్పందించిన పాండ్య..‘నవంబర్ 15న ఉదయం నేను నా లగేజీతో దుబాయ్ నుంచి ఇండియాకు చేరుకున్నాను.  ముంబై ఎయిర్ పోర్టులోని కస్టమ్స్ అధికారుల దగ్గరకు వెళ్లి నేను కొన్న వస్తువుల గురించి తెలిపాను. అందుకు సంబంధించిన పత్రాలను చూపించి కస్టమ్స్ డ్యూటీని కూడా చెల్లించాను. కానీ సోషల్ మీడియా లో నా మీద తప్పుడు ప్రచారం జరుగుతున్నది. అసలేం జరిగిందనే విషయమై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను..’ అంటూ ట్వీట్ చేశాడు. 

Latest Videos

‘నేనే కస్టమ్స్ అధికారుల దగ్గరకు వెళ్లి దుబాయ్ లో కొన్న వస్తువులను వారి ముందు ఉంచాను. వాళ్లు (కస్టమ్స్ ఆఫీసర్స్) అందుకు సంబంధించిన బిల్లులను అడిగారు. నేను వాటిని సమర్పిస్తానని తెలిపాను. అవి వాళ్లకు ఇచ్చేశాను కూడా. వాటికి ఎంత సుంకం చెల్లించాలనేది వాళ్లు నాకు చెప్పారు. నిజానికి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్టు ఆ వాచ్ ధర రూ. 5 కోట్లు కాదు. కోటిన్నరగా ఉంటుంది..’ 

 

pic.twitter.com/k9Qv0UnmyS

— hardik pandya (@hardikpandya7)

‘నేను మన దేశ చట్టాలకు లోబడి ఉండే  పౌరుడిని. అన్ని ప్రభుత్వ సంస్థలను నేను  గౌరవిస్తాను. అంతేగాక వారికి ఏ సహకారం (ఈ వివాదానికి సంబంధించి) కావాలన్నా అందిస్తాను. నేను చట్టాన్ని అతిక్రమించానని వస్తున్న వార్తలు నకిలీవి. నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం..’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. 

పాండ్య బ్రదర్స్ ఇలా  ఖరీదైన వాచ్ ల వివాదంలో చిక్కుకోవడం ఇదే ప్రథమం కాదు. హార్ధిక్ సోదరుడు కృనాల్ పాండ్య కూడా గతేడాది ఐపీఎల్ ముగిసిన వెంటనే ముంబై ఎయిర్ పోర్టులో దిగిన కృనాల్ నుంచి ఇలాగే విదేశీ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కృనాల్ దగ్గర వాచీలతో పాటు భారీ మొత్తంలో బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారని వార్తలు వినిపించాయి.  

కాగా.. నవంబర్ 14 అర్ధరాత్రి దుబాయ్ నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న పాండ్య దగ్గర రెండు ఖరీదైన వాచీలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని నేటి ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఆ వాచీలకు సరైన పత్రాలు చూపిండచంలో హార్ధిక్ విఫలమయ్యాడని, అందుకే కస్టమ్స్ వాళ్లు వాటిని సీజ్ చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో  పాండ్య క్లారిటీ ఇచ్చాడు.

click me!