
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నేడు 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లతో పాటు భారత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ కూడా యువీకి బర్త్ డే విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా విరాట్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశాడు. వీడియోలో విరాట్.. యువీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. అతడితో కలిసి క్రికెట్ ఆడినప్పటి రోజులను నెమరువేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాలలో వైరల్ గా మారింది.
కోహ్లీ స్పందిస్తూ.. ‘నేను అండర్-19 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులోకి అడుగుపెట్టాను. ఆ సమయంలో యువరాజ్ నన్ను బాగా చూసుకున్నాడు. నేను జట్టుతో కలిసిపోవడానికి నాతో కంఫర్టబుల్ గా ఉన్నాడు. ఎప్పుడూ జోక్ లు వేస్తూ, ఫ్రీగా ఉండేవాడు. కొన్ని విషయాల్లో మా ఇద్దరి అలవాట్లు ఒకే విధంగా ఉంటాయి.
మా ఇద్దరికీ పంజాబీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇద్దరం వేసుకునే బట్టలు, షూ, ఇతరత్రా వస్తువుల విషయంలో కూడా మా ఇద్దరి అభిరుచి ఒకే విధంగా ఉండేది. చాలా రోజుల పాటు ఇద్దరం కలిసి షాపింగ్ చేసేవాళ్లం. అంతేగాక మాకు ఒకే రకమైన ఫుడ్ అంటే ఇష్టం ఉండేది. హ్యాపీ బర్త్ డే యువీ అన్నా...’ అంటూ వీడియోలో పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా గతంలో తాము శ్రీలంకలో ఉన్నప్పుడు జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ‘మేము దంబుల్లాలో ఉన్నాము. అప్పుడు టైం తెల్లవారుజామున 3 లేదా 3:30 గంటలు అయుంటది. ఆ సమయంలో మేము సైకిళ్ల మీద కొలంబోకు రైడ్ కు వెళ్లాము. కానీ ఓ చోట స్కిడ్ అయి నేల మీద పడ్డాము. ఆ విషయం నాకింకా గుర్తుంది. ఆ తర్వాత చాలా సేపటిదాకా మేము నవ్వుకుంటూనే ఉన్నాం...’ అని కోహ్లీ తెలిపాడు.
కోహ్లీ తో పాటు యువరాజ్ మాజీ సహచరులు కూడా అతడికి బర్త్ డే విషెస్ తెలిపారు. మహ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, వినయ్ కుమార్ లే గాక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా యువరాజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక యువరాజ్ తన 19 ఏళ్ల కెరీర్‌లో టీమిండియా తరపున 40 టెస్టులు, 304 వన్డేలు ఆడాడు. టెస్టులలో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1,900 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 10 వికెట్లు తీశాడు. ఇక వన్డేల్లో 14 సెంచరీలు.. 52 అర్థ శతకాలతో కలిపి 8,701 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 111 వికెట్లు పడగొట్టాడు. 58 టీ20లలో 8 హాఫ్ సెంచరీలతో 1,177 పరుగులు చేసిన యువీ బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లు ఇండియా గెలవడంలో యువరాజ్ కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడ్డా తిరిగి కోలుకుని భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.