కేరళకు చెందిన విఘ్నేశ్ పుతూర్ తన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. పేదరికాన్ని జయించి ఐపీఎల్ వరకు ఎదిగిన అతని ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.
అద్భుత ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు సరైన అవకాశం వస్తే, వారు గొప్ప విజయాలను సాధిస్తారనే విషయాన్ని మరోసారి రుజువు చేసిన వ్యక్తి విఘ్నేశ్ పుతూర్. కేరళకు చెందిన ఈ యువ క్రికెటర్, తన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేకమంది యువ ఆటగాళ్ల కెరీర్‌ను మలిచిన మేలైన వేదిక. టీమిండియాలో స్థానం సంపాదించిన చాలామంది క్రికెటర్లు ఐపీఎల్ వేదికగా మెరిసి సెలక్టర్ల దృష్టిలో పడ్డారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ప్రతిభావంతుడైన స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ చేరాడు. ముంబయి తరఫున తన తొలి మ్యాచ్‌లోనే 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి మెరిశాడు. దీపక్ హుడా, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్‌లను పెవిలియన్‌కు పంపి తన స్పిన్ మాంత్రికతను ప్రదర్శించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి తన సత్తా చాటడం విశేషం!
24 ఏళ్ల విఘ్నేశ్ పుతూర్ కేరళ తరఫున సీనియర్ క్రికెట్ ఆడుతున్నాడు. అతడి తండ్రి సునీల్ కుమార్ ఓ ఆటో డ్రైవర్ కాగా, తల్లి బిందు గృహిణి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా, తన క్రికెట్ కలలకు కుటుంబ సభ్యులు పూర్తిగా అండగా నిలిచారు. మలప్పురంలో పుట్టిన పుత్తూర్, క్రికెట్‌లో మెరుగైన శిక్షణ కోసం త్రిశూర్‌కు మారాడు. ప్రారంభంలో మీడియం పేసర్‌గా ఆడినా, తరువాత స్పిన్నర్‌గా మారి తన మేనమతుకు తగ్గట్లుగా ప్రదర్శన ఇచ్చాడు.
సెయింట్ థామస్ కాలేజీ తరఫున అద్భుత ప్రదర్శన ఇచ్చిన విఘ్నేశ్ పుతూర్, కేరళ క్రికెట్ లీగ్ (KCL) తొలి సీజన్‌లో అలెప్పీ రిపిల్స్ తరఫున ఆడాడు. తరువాత తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అండర్-23 స్థాయిలో కేరళకు ప్రాతినిధ్యం వహించి, అంచనాలను మించి రాణించాడు.
కేసీఎల్ సమయంలో ముంబయి ఇండియన్స్ అతని ప్రతిభను గుర్తించింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసి, సీజన్ ప్రారంభానికి ముందు SA20 లీగ్‌కు పంపించింది. అక్కడ ముంబయి కేప్ టౌన్ జట్టులో నెట్ బౌలర్‌గా ఉండే అవకాశం వచ్చింది. ఈ సమయంలో రషీద్ ఖాన్ వంటి అగ్రశ్రేణి స్పిన్నర్లతో కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కింది.
ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే, విఘ్నేశ్ పుతూర్ బౌలింగ్ స్టైల్ చూసి, "ఇతడు మరో కుల్‌దీప్ యాదవ్ అవుతాడా?" అని ప్రశ్నించాడు. చెన్నైతో మ్యాచ్‌లో 70 కిలోమీటర్ల వేగంతో సంధించిన ఫ్లైటెడ్ డెలివరీలు బ్యాటర్లను ఇబ్బంది పెట్టాయి. కుల్‌దీప్ తరహా స్లో టర్న్ బంతులను వేయడంలో విఘ్నేశ్ పుతూర్ మేటి అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్‌లో చెన్నైపై ముంబయి తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ, విఘ్నేశ్ పుతూర్ అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను చివరివరకు ఉత్కంఠభరితంగా మార్చాడు. రచిన్ రవీంద్ర (65*), రుతురాజ్ గైక్వాడ్ (53) బాగా ఆడినప్పటికీ, విఘ్నేశ్ పుతూర్ మ్యాచును టర్న్ చేసే బౌలింగ్ చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ, ప్రత్యేకంగా విఘ్నేశ్ పుతూర్ ని అభినందించడం విశేషం.
ఒక యువ ఆటగాడికి ధోనీ చేతుల మీదుగా వచ్చిన ప్రశంస కంటే గొప్ప ప్రోత్సాహం ఏముంటుంది? ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో టీమ్ ఇండియాకు ఆడే అవకాశం కూడా అతడికి తప్పక వస్తుంది.
ఒక ఆటో డ్రైవర్ కుమారుడు, తన కష్టాలను దాటుకుని, ఐపీఎల్ వేదికగా మెరిసి, ధోనీ వంటి దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకోవడం నిజంగా ప్రేరణగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో విఘ్నేశ్ పుతూర్ భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తాడా? కాలమే సమాధానం చెప్పాలి!