
ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పకనెగ్గాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైన ఢిల్లీ క్యాపిటల్స్ పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కీలక సమయంలో డీఆర్ఎస్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ వాళ్లది వాళ్లు నిందించుకోవాలని అన్నాడు. ఇలా జరుగడం వాళ్ల కర్మ అని వ్యాఖ్యానించాడు. శనివారం నాటి మ్యాచ్ లో ముంబై బ్యాటర్ బ్రెవిస్ ను ఔట్ చేసిన వెంటనే టిమ్ డేవిడ్ కూడా ఔట్ కావాల్సింది. కానీ రిషభ్ పంత్ చేసిన తప్పిదానికి ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది.
ఢిల్లీ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్య ఛేదనలో అప్పటిదాకా నిదానంగానే ఆడిన ముంబై ఆఖర్లో జోరు పెంచడానికి యత్నించింది. డెవాల్డ్ బ్రెవిస్ (37) ను ఔట్ చేశాక టిమ్ డేవిడ్ (34) క్రీజులోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 15 వ ఓవర్లో నాలుగో బంతి.. అతడి బ్యాట్ ను తాకుతూ రిషభ్ చేతుల్లోకి వెళ్లింది.
అందుకు శార్దూల్, రిషభ్ లు ఔట్ కోసం అప్పీల్ చేసినా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఆ సమయంలో పంత్ ను చూస్తే రివ్యూ తీసుకుంటాడనే అనిపించింది. కానీ అతడు.. శార్దూల్ తో చర్చించి డీఆర్ఎస్ తీసుకోలేదు. పక్కనే ఉన్న సర్ఫరాజ్ ఖాన్ వచ్చి పంత్ తో వారించాడు. డీఆర్ఎస్ తీసుకోమని కోరాడు. కానీ పంత్ ఆ సాహసం చేయలేదు. ఫలితంగా.. 11 బంతులాడిన టిమ్ డేవిడ్ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో వీర విధ్వంసం సృష్టించాడు. ఢిల్లీకి చేయాల్సిన నష్టాన్ని చేసి పెవిలియన్ చేరాడు. అప్పటిదాకా మ్యాచ్ లో ఇద్దరికీ విజయావకాశాలున్నా.. ఢిల్లీకే కాస్త ఆధిక్యం ఉండేది.
అయితే పంత్ రివ్యూ తీసుకోకపోవడం పై మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘అక్కడ ఉన్నవాళ్ల కామన్ సెన్స్ ఏమైంది..? సరే.. రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్ లు చర్చించారు సరే. అక్కడే ఉన్న మిగతా ఫీల్డర్లు ఏం చేస్తున్నారు..? మీకింకా ఐదు ఓవర్లున్నాయి. రెండు రివ్యూలు కూడా ఉన్నాయి. టిమ్ డేవిడ్ అప్పుడే వచ్చాడు. వరుసగా రెండు వికెట్లు పడితే పరిస్థితి మరో విధంగా ఉండేది కదా.. ముంబై మీద ఒత్తిడి పెరిగేది. మీరు ఆధిక్యంలోకి వచ్చి ఉండేవారు..
దీనికి వాళ్లను వాళ్లు నిందించుకోవడం తప్ప మిగిలిందేమీ లేదు. ఎందుకంటే ఇది మామూలు మ్యాచ్ కాదు. ప్లేఆఫ్స్ చేరాలంగే నెగ్గాల్సిన కీలక పోరు. ఇక ఇప్పుడు వాళ్లు నిద్ర లేనిరాత్రులు గడపాల్సి ఉంటుంది.’ అని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓడటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.