IPL 2022: ఢిల్లీని ఆదుకున్న పంత్, పావెల్.. ముంబై ముందు ఈజీ టార్గెట్

By Srinivas MFirst Published May 21, 2022, 9:24 PM IST
Highlights

TATA IPL 2022 MI vs DC: ప్లేఆఫ్ రేసులో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో  ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ తలపడ్డారు. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయిన ఢిల్లీని కెప్టెన్ రిషభ్ పంత్,  రొవ్మెన్ పావెల్ ఆదుకున్నారు.  

ఐపీఎల్-15 లో ప్లేఆఫ్ రేసులో కీలక మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో తడబడింది. ఆరంభంలోనే తడబడిన ఢిల్లీ.. చివరి దాకా కోలుకోలేదు. ఇన్నింగ్స్ మధ్య లో కెప్టెన్ రిషభ్ పంత్ (39), రొవ్మెన్ పావల్ (43) ఆదుకోకుంటే ఢిల్లీ  పరిస్థితి మరీ దారుణంగా ఉండేది.  పడుతూ లేస్తూ.. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ముంబైని అంతకంటే తక్కువ స్కోరుకే నిలవరిస్తేనే ఢిల్లీకి అవకాశాలుంటాయి. లేదంటే బ్యాగ్ సర్దుకోవడమే. 

టాస్ ఓడి  బ్యాటింగ్  కు వచ్చిన ఢిల్లీకి రెండో ఓవర్లోనే ముంబై ఇండియన్స్ బౌలర్లు షాకిచ్చారు. మంచి ఫామ్ లో ఉన్న ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (5) తో పాటు మిచెల్ మార్ష్ (0) లను ఔట్ చేసి మ్యాచ్ ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 3 ఓవర్లలో 22 పరుగులకే ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 

పృథ్వీ షా (23 బంతుల్లో 24.. 2 ఫోర్లు, 1 సిక్సర్)  కూడా టచ్ లోనే కనిపించినా.. బుమ్రా బౌలింగ్ లో ఇషాన్ కిషన్ అందుకున్న అద్భుత క్యాచ్ తో పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (10) కూడా ఆకట్టుకోలేదు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికే ఢిల్లీ.. 50 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. 

ఆ క్రమంలో రిషభ్ పంత్ (33 బంతుల్లో 39.. 4 ఫోర్లు, 1 సిక్సర్) తో జతకలిసిన రొవ్మెన్ పావెల్ (34 బంతుల్లో 43.. 1 ఫోర్, 4 సిక్సర్లు).. ఆచితూచి ఆడారు. వికెట్ కాపాడుకోవాలన్న వీరి బాధ్యతకు తోడు ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ స్కోరు బోర్డు వేగం నెమ్మదించింది. అయితే 12వ ఓవర్ వేసిన  హృతిక్ షోకీన్ బౌలింగ్ లో 6, 6, 4 తో పావెల్ కాస్త జోరు పెంచాడు. ఆ తర్వాత మార్కండే వేసిన 13వ ఓవర్లో 6, 4 బాది ఢిల్లీ స్కోరుకు ఊపు తెచ్చాడు. రమణ్దీప్ సింగ్ వేసిన 16వ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాదిన పంత్.. ఆఖరి బంతికి ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో 75 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.  

 

The target we've set for MI 👉1⃣6⃣0⃣

How are you feeling, DC fans❓

— Delhi Capitals (@DelhiCapitals)

పంత్ నిష్క్రమించినా.. ఆదుకుంటాడనుకున్న పావెల్.. చివరికి బుమ్రా వేసిన 19వ ఓవర్లో రెండో బంతికి బౌల్డ్ అయ్యాడు.  ఇక ఆఖర్లో.. అక్షర్ పటేల్ (19 నాటౌట్) ఢిల్లీ స్కోరును 150 పరుగులు దాటించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా.. 3 వికెట్లు తీయగా.. రమణ్దీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. డేనియల్ సామ్స్, మార్కండే లు తలో వికెట్ పడగొట్టారు. 

click me!