IPL 2022: ఢిల్లీని ముంచిన ముంబై.. ప్లే ఆఫ్స్ కు బెంగళూరు.. ఆఖరి మెట్టుమీద క్యాపిటల్స్ బోల్తా..

By Srinivas MFirst Published May 21, 2022, 11:28 PM IST
Highlights

TATA IPL 2022 MI vs DC: ‘తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టు..’ ప్లేఆఫ్ రేసునుంచి ఎప్పుడో తప్పుకున్న ముంబై ఇండియన్స్  లీగ్ దశను ముగిస్తూ తనతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ను కూడా వెంట తీసుకెళ్లింది. ఆర్సీబీ అభిమానుల ఆశలను కాపాడుతూ బెంగళూరును ప్లేఆఫ్స్ కు చేర్చింది. 

ఐపీఎల్-15 లో లీగ్ దశను ముంబై ఇండియన్స్ విజయంతో ముగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలను సమాధి చేస్తూ.. బెంగళూరు నుసటి రాతను మార్చింది.  సీజన్ లో పడుతూ లేస్తూ ప్లేఆఫ్ ఆశల పల్లకిలో ఊరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు మరోసారి వామహస్తమే మిగిల్చింది. ఆర్సీబీ అభిమానుల ఆశలను వమ్ము చేయకుండా బెంగళూరు ను ప్లేఆఫ్స్ కు పంపింది. ఢిల్లీ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ముంబై.. మరో 5 బంతులు మిగిలుండగానే  ఛేదించింది. ‘తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచినట్టు..’ అన్న సామెతను గుర్తు చేస్తూ పోతూ పోతూ ప్లేఆఫ్ రేసులో ఆఖరి మెట్టు మీద నిల్చున్న ఢిల్లీని నిండా ముంచి వెళ్లింది. ఈ సీజన్ ను ఓటమితో ప్రారంభించిన ముంబై విజయంతో ముగించింది. 

తాజా విజయంతో ముంబై.. ఈ సీజన్ లో  14 మ్యాచులాడి 4 మాత్రమే విజయాలతో  8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. మరోవైపు.. 14 మ్యాచులాడిన ఢిల్లీ.. 7 మ్యాచులు గెలిచి ఏడింటిలో ఓడి ఐదో స్థానంలో నిలిచింది. ముంబై-ఢిల్లీ పోరులో  రోహిత్ సేన నెగ్గడంతో ఆర్సీబీ  నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. 14 మ్యాచులాడిన ఆర్సీబీ.. 8 మ్యాచులు గెలిచి.. ఆరింటిలో ఓడి 16  పాయింట్లు సాధించింది. 

మోస్తరు లక్ష్య ఛేదనలో  ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ నెమ్మదిగా ప్రారంభమైంది.  13 బంతులాడిన ముంబై సారథి రోహిత శర్మ.. 2 పరుగులకే వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 48.. 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తో కలిసిన వన్ డౌన్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ (33 బంతుల్లో 37.. 1 ఫోర్, 3 సిక్సర్లు)  ముంబై ఇన్నింగ్స్  నడిపించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 51 పరుగుల భాగస్వామ్యం  నెలకొల్పారు. 

ముందు నెమ్మదిగా ఆడిన ఈ ఇద్దరూ కుదురుకున్నాక బ్యాట్లకు పని చెప్పారు. కుల్దీప్ యాదవ్ ను లక్ష్యంగా చేసుకున్న బ్రెవిస్.. అతడు వేసిన వరుస ఓవర్లలో రెండు సిక్సర్లు, ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా బ్యాట్ ఝుళిపించడంంతో ముంబై 11 ఓవర్లకు వికెట్ నష్టపోయి 74 పరుగులు చేసింది. అయితే 12వ ఓవర్ మూడో బంతికి కిషన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో వార్నర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్లో ఐదో బంతికి బ్రెవిస్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను పంత్ నేల పాల్జేశాడు.  

అయితే ఆ అవకాశాన్ని బ్రెవిస్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శార్దూల్ వేసిన 15వ ఓవర్లో.. మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన టిమ్ డేవిడ్ (11 బంతుల్లో 34.. 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా ఆ తర్వాత బంతికే ఔట్ కావాల్సింది. శార్దూల్ వేసిన బంతి.. డేవిడ్ బ్యాట్ ను ముద్దాడుతూ వెళ్లింది. పంత్, శార్దూల్ లు అంపైర్ కు ఔట్ కోసం అప్పీల్ చేసినా వారికి అనుకూల ఫలితం రాలేదు.  కానీ అల్ట్రా ఎడ్జ్ లో మాత్రం అది బ్యాట్ కు తాకుతూ వెళ్లినట్టు స్పష్టంగా తేలింది. 

కాగా.. ఆఖరి నాలుగు ఓవర్లలో 46 పరుగులు అవసరమనగా తిలక్ వర్మ (21) తో కలిసి విధ్వంసకర ఆటగాడు డేవిడ్ ముంబైని అపూర్వవిజయాన్ని అందించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన  17వ ఓవర్లో 4, 4, 6 బాదిన డేవిడ్.. ఆ తర్వాత ఠాకూర్ వేసిన 18వ ఓవర్లో 6, 6 తో ముంబైని లక్ష్యాన్ని చేరువ చేశాడు.  అయితే అదే ఓవర్ ఆఖరి బంతికి డేవిడ్ ఔటైనా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మిగతా లాంఛనాన్ని తిలక్  వర్మ, రమణ్దీప్ సింగ్ (13 నాటౌట్) పూర్తి చేశారు. 

 

All eyes on the game. 👀

No prizes for guessing who were supporting! pic.twitter.com/i7mrYfVYMt

— Royal Challengers Bangalore (@RCBTweets)

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.   ఆ జట్టులో రొవ్మెన్ పావెల్ (43), రిషభ్ పత్ (39) లు మాత్రమే రాణించారు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బందిపడ్డారు. 

click me!