RR vs DC : రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తన రెండో మ్యాచ్ లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. గత ఐపీఎల్ కు దూరమైన రిషబ్ పంత్ ప్రస్తుతం జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే, మ్యాచ్ ఓటమి తర్వాత పంత్ నిరాశతో మాట్లాడిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Rishabh Pant : ఢిల్లీ క్యాపిటల్స్ తో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించి మరో విజయాన్ని అందుకుంది. దీంతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి వచ్చింది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇప్పటివరకు విజయాన్ని అందుకోలేకపోయింది. తన రెండో మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 వోర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. 186 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చాలా కాలం తర్వాత గతేడాది ఐపీఎల్ ఆడని రిషబ్ పంత్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో ఆడిన తొలి రెండు మ్యాచ్ లలోనూ ఓటమి పాలుకావడంతో తన నిరాశను వ్యక్తం చేశాడు. అదే సమయంలో తన కోపాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన రెండో మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఎక్కడ తప్పు చేసిందో వివరించాడు. మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ.. "ఈ ఓటమితో నేను నిరాశ చెందాను.. అయితే ఈ ఓటమి నుంచి నేర్చుకోవడమే ఇప్పుడు మనం చేయగలిగిన గొప్పదనం. మ్యాచ్‌లో మన బౌలర్లు రాజస్థాన్ జట్టును 15-16 ఓవర్ల పాటు కట్టడి చేశారు. కానీ, ఆ తర్వాత అదుపు చేయలేకపోయాం. డెత్ ఓవర్లలో తప్పు చేశామని" చెప్పాడు. ఇదే తమ జట్టు కొంప ముంచిందని అభిప్రాయపడ్డాడు.
అలాగే, 'నెమ్మదిగా ప్రారంభించిన తర్వాత, డెత్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించడం చాలా సార్లు జరుగుతుంది. నేటి మ్యాచ్‌లోనూ అదే జరిగింది. చివరి ఓవర్లలో రియాన్ పరాగ్ ఆటతో మ్యాచ్‌పై మా పట్టును పూర్తిగా కోల్పోయాము. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ మాకు మంచి ఆరంభాన్ని అందించారు, కానీ మిడిల్ ఓవర్లలో మేము మా వికెట్లు కోల్పోయిన విధానం చాలా ఘోరంగా ఉందని" రిషబ్ పంత్ అన్నాడు. అలాగే, అప్పటికి చాలా మంది ఉన్నప్పటికీ మిడిలార్డర్ బ్యాటింగ్‌లో సత్తా చాటాల్సిందని చెప్పాడు. నోర్కియా వేసిన చివరి ఓవర్ గురించి మాట్లాడిన పంత్.. ఈ ఓవర్‌లో 25 పరుగులు ఇవ్వడం కూడా జట్టుకు మైనస్ అయిందన్నాడు. అయితే, రాబోయే మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేస్తామని చెప్పాడు.
IPL 2024: ఢిల్లీ బౌలింగ్ ను రఫ్ఫాడించిన రియాన్ పరాగ్.. 3వ ఐపీఎల్ హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి.. !