
నిమిషనిమిషానికి చేతులు మారే పొట్టి క్రికెట్లో జట్ల తలరాతలే కాదు ఆటగాళ్ల భవితవ్యాలూ క్షణాల్లో మారిపోతుంటాయి. ఒక సీజన్ కు ఒక జట్టుకు ఆడిన ఆటగాడు మరో సీజన్ కు అదే టీమ్ తరఫున ఆడతాడనే గ్యారెంటీ లేదు. అయితే ఈ విషయంలో ప్రతిభ లేని వారి సంగతి అటుంచితే అది కావాల్సినంత ఉండి కూడా అవకాశాలు రాని వారి పరిస్థితి మాత్రం వర్ణనాతీతం. అటువంటి కోవకే చెందినవాడు ముంబయి ఇండియన్స్ (mumbai indians) విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.
2018 నుంచి ముంబయికి ఆడుతున్న యాదవ్.. అంతకుముందు నాలుగేండ్ల పాటు కోల్కతాకు ఆడాడు. ఆ సమయంలో యాదవ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కోల్కతా కూడా అతడిని సరైన రీతిలో వినియోగించుకోలేదు. ఇదే విషయమై ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ స్పందించాడు.గంభీర్ స్పందిస్తూ... ‘సూర్య కుమార్ ను మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపకపోవడం మేము (కోల్కతా) చేసిన అతిపెద్ద తప్పు. ఆ విషయంలో నేను ఇప్పటికీ విచారపడుతుంటాను. మూడో స్థానంలో యాదవ్ ను బ్యాటింగ్ కు పంపాలని ఉన్నా ఆ ప్లేస్ లో మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్ దిగాల్సి వచ్చేది. దీంతో మేము సూర్యను ఫినిషర్గా వాడాలని అనుకున్నాం. చివరికి మేము అతడిని వదులుకున్నాం. జట్టుగా అది మాకు అతిపెద్ద దెబ్బ’ అని చెప్పుకొచ్చాడు.
2012లో ముంబయి ఇండియన్స్ తరఫున అరంగ్రేటం చేసిన యాదవ్.. 2014లో కోల్కతాకు వెళ్లాడు. ఆ జట్టుతో నాలుగేండ్ల ప్రయాణంలో 54 మ్యాచ్ లు ఆడినా అవకాశాలు రాక సరైన ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక తిరిగి 2018లో మళ్లీ ముంబై జట్టే యాదవ్ ను కొనుగోలు చేసింది. ఆ సీజన్ నుంచి వరుసగా 512, 424, 480 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే క్రమంలో టీమ్ ఇండియా సెలక్టర్ల కంట్లో పడ్డ సూర్య.. గతేడాది భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్ లోనూ సూర్య చోటు దక్కించుకున్నాడు.