IPL 2021: బ్రావో నా సోదరుడితో సమానం.. కానీ అతడితో ఎప్పుడూ గొడవే.. ధోని షాకింగ్ కామెంట్స్

Published : Sep 25, 2021, 12:42 PM IST
IPL 2021: బ్రావో నా సోదరుడితో సమానం.. కానీ అతడితో ఎప్పుడూ గొడవే.. ధోని షాకింగ్ కామెంట్స్

సారాంశం

MS DHONI & BRAVO: ఐపీఎల్ లో నాన్నల టీమ్ గా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ (CHENNAI SUPER KINGS)లో సభ్యులు ఆటగాళ్ల కంటే అంతకుమించిన రిలేషన్ ను  ఆఫ్ ది ఫీల్డ్ లోనూ కొనసాగిస్తారు. ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని, ఆల్ రౌండర్ బ్రావో మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. 

ప్రస్తుతమున్న ఐపీఎల్ జట్లలో అత్యంత సీనియర్ ఆటగాళ్లను అంటిపెట్టుకున్న టీమ్ గా చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రత్యేకమైన  గుర్తింపు ఉంది. కెప్టెన్ ధోని, సురేశ్ రైనా, డుప్లెసిస్, మోయిన్ అలీ, జడేజా, బ్రావో వంటి సీనియర్లే చెన్నైకి బలం. అయితే జట్టుగా కంటే వీరందరి మధ్య సత్సంబంధాలు ఉంటాయి. పేరుకు వెస్టిండీస్ క్రికెటరైనా డ్వేన్ బ్రావో మాత్రం చెన్నై ఆల్ రౌండర్ గా ఎంతో పేరు గడించాడు. 

జట్టుకు అవసరమున్నప్పుడల్లా చెలరేగే ఆటగాడిగా బ్రావోపై ధోనికి గురి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లలో బ్రావో.. చెన్నైని ఒంటి చేత్తో గెలిపించగల సమర్థుడు. అందుకే అతడిని ధోని సోదరుడిలా భావిస్తాడు. ఈ విషయాన్ని ధోని ఇదివరకే వెల్లడించాడు. తాజాగా శుక్రవారం నాటి రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ తర్వాత కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించాడు. బ్రావో తనకు సోదర సమానుడని, కానీ అతడితో నిత్యం గొడవ పడుతుంటానని ధోని చెప్పుకొచ్చాడు. 


మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘స్లో బంతులు వేయడంలో బ్రావో సిద్ధహస్తుడు.  ఇదే విషయం గురించి కొన్నేండ్లుగా మేమిద్దరం తరుచూ గొడవ పడుతున్నాం. స్లో బాల్స్ కంటే కూడా ఓవర్ లో ఆరు బంతులను ఆరు విధాలుగా వేయాలని నేను బ్రావోకు చెబుతుంటాను. ఏదేమైనా ఈ ఫార్మాట్లో బ్రావో గొప్ప ఆటగాడు. విభిన్న పరిస్థితులలో జట్టుకు అవసరమైనప్పుడు అతడు మాకోసం బాధ్యతల్ని గొప్పగా నిర్వర్తించాడు’ అని అన్నాడు. బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా చివరి ఓవర్ వేసిన బ్రావో.. ఆ ఓవర్ లో మ్యాక్స్వెల్ ను ఔట్ చేయడమే గాక రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేగాక ఓపెనర్ల వీరవిహారానికి కూడా అడ్డుకట్ట వేశాడు. 


బ్రావోతో పాటు ఆర్సీబీని కట్టడి చేసిన జడేజా పైనా ధోని ప్రశంసలు కురిపించాడు. ఒకవైపు దేవదత్ పడిక్కల్, కోహ్లి చెలరేగుతున్న సమయంలో.. ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి తాను మోయిన్ అలీతో బౌలింగ్ చేయిద్దామనుకున్నానని, కానీ చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకుకని జడేజాకు బంతి ఇచ్చానని తెలిపాడు. జడ్డూ వికెట్లేమీ తీయకపోయినా పరుగుల వేగాన్ని అడ్డుకున్నాడు. జడేజా అనంతరం బౌలింగ్ కు దిగిన  బ్రావో.. చెన్నైని తిరిగి పుంజుకునేలా చేశాడు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 auction లో కామెరాన్ గ్రీన్ కు రూ.25 కోట్లు.. చేతికి వచ్చేది రూ.18 కోట్లే ! ఎందుకు?
IPL 2026 Auction: కామెరాన్ గ్రీన్‌కు జాక్‌పాట్.. రూ. 25.20 కోట్లు కుమ్మరించిన కేకేఆర్ !