లంకను ఆడుకున్న అమ్మాయిలు... రెండో టీ20లో ఘన విజయం, సిరీస్ కైవసం...

By Chinthakindhi RamuFirst Published Jun 25, 2022, 5:55 PM IST
Highlights

రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం అందుకున్న భారత మహిళా జట్టు... ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. 

వన్డే వరల్డ్ కప్ 2022 సీజన్‌ పరాభవం తర్వాత శ్రీలంకలో పర్యటిస్తున్న భారత మహిళా జట్టు, తొలి రెండు టీ20ల్లో గెలిచి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. దంబుల్లాలో జరిగిన రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక వుమెన్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది...

విస్మీ గుణరత్నే 50 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేయగా కెప్టెన్ ఆటపట్టు 41 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఈ ఇద్దరూ అవుటైన తర్వాత మాధవి 13 బంతుల్లో 9, కవిశా డిల్హరీ 5 బంతుల్లో 2, నిఖిలాక్షి డి సిల్వ 2 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ కాగా హసినీ పెరేరా డైమండ్ డకౌట్‌గా పెవిలియన్ చేరింది...

క్రీజులోకి వచ్చిన హసినీ పెరేరా, బంతులేమీ ఎదుర్కోకుండా రనౌట్‌ అయ్యింది. రణసింగే 5, అనుష్క సంజీవని 8 పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా రేణుకా సింగ్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, హర్మన్‌ప్రీత్ కౌర్ తలా ఓ వికెట్ తీశారు...

126 పరుగుల లక్ష్యఛేదనలో షెఫాలీ వర్మ మెరుపు ఆరంభం అందించి అవుటైంది. 10 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన షెఫాలీ వర్మ అవుటైన తర్వాత 10 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసిన సబ్బినేని మేఘన కూడా పెవిలియన్ చేరింది...

స్మృతి మంధాన 34 బంతుల్లో 8 ఫోర్లతో 39 పరుగులు చేసి అవుట్ కాగా జెమీమా రోడ్రిగ్స్ 6 బంతుల్లో 3 పరుగులు చేసి నిరాశపరిచింది. యషికా భఆటియా 18 బంతుల్లో 13 పరుగులు చేసి అవుట్ అయ్యింది. ఒకనాక దశలో 91 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టును హర్మన్‌ప్రీత్ కౌర్ ఆదుకుంది. 32 బంతుల్లో 2 ఫోర్లతో 31 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్, ఆఖరి ఓవర్‌ మొదటి బంతికి ఫోర్ బాది విజయాన్ని అందించింది...

ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకుంది. మూడు మ్యాచుల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న భారత మహిళా జట్టు, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది...

మొదటి టీ20లో 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది టీమిండియా... ఈ సిరీస్‌లో మిగిలిన ఆఖరి, మూడో టీ20 జూన్ 27న జరగనుంది. ఆ తర్వాత శ్రీలంక, ఇండియా కలిసి మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. ఈ వన్డేలు ఐసీసీ ఛాంపియన్‌షిప్ పాయింట్లకు కీలకంగా మారనున్నాయి. 

click me!