అందుకే ఆయన్ని ‘కింగ్’ కోహ్లీ అనేది... కమ్లేశ్ నాగర్‌కోటిని ఎగతాళి చేస్తున్న వ్యక్తికి బుద్ధి చెప్పిన విరాట్...

By Chinthakindhi RamuFirst Published Jun 25, 2022, 5:01 PM IST
Highlights

లీస్టర్‌షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కమ్లేశ్ నాగర్‌కోటిని ఇబ్బంది పెట్టిన ప్రేక్షకులు... బాల్కనీ నుంచి గట్టి వార్నింగ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. 

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీని ‘కింగ్’ ప్రేమగా పిలుచుకుంటారు అభిమానులు. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో ఐసీసీ కూడా విరాట్ కోహ్లీని ‘కింగ్’గా చూపిస్తూ పోస్టు చేసింది. రాజు అనేవాడు రాజ్యాన్ని ఏలడమే కాదు, తన రాజ్యంలోనివారి బాగోగులను కూడా చూసుకోవాలి. ఈ విషయంలో మాత్రం విరాట్ నిజంగా కింగ్ కోహ్లీయే...

ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, రిషబ్ పంత్... ఇలా ఏ ప్లేయర్‌ని ట్రోల్ చేసినా ముందుకు దూసుకొచ్చి ప్రత్యర్థి జట్టుకి స్ట్రాంగ్ రిప్లై ఇస్తాడు విరాట్ కోహ్లీ. ఈ బిహేవియర్ కారణంగా విరాట్ కోహ్లీని అగ్రెసివ్ కెప్టెన్ అని కూడా పిలుస్తారు...

Virat teaching lesson to a guy in crowd who was making fun of Kamlesh Nagarkoti who standing near Boundary line while fielding in practise game. pic.twitter.com/1DlYhUfy8n

— Virarsh (@Cheeku218)

లార్డ్స్ టెస్టులో జస్ప్రిత్ బుమ్రాను టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేసిన ఇంగ్లాండ్ జట్టుకి 45 నిమిషాల్లో ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించాడు విరాట్ కోహ్లీ. టీమిండియా చరిత్రలోనే ఆ విజయం ఓ అద్భుతం... కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, విరాట్ కోహ్లీ తన టీమ్ మేట్స్ పట్ల కేర్ తీసుకోవడం మాత్రం మానలేదు...

తాజాగా భారత జట్టు, ఇంగ్లాండ్ టూర్‌లో లీస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌తో జరుగుతున్న 4 రోజుల వార్మప్ మ్యాచ్‌లో యంగ్ పేసర్ కమ్లేశ్ నాగర్‌కోటికి మద్ధతుగా నిలిచాడు విరాట్ కోహ్లీ. భారత జట్టుకి నెట్ బౌలర్‌గా ఎంపికైన కమ్లేశ్ నాగర్‌కోటి, బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఓ వ్యక్తి, అతన్ని పిలుస్తూ, తిడుతూ ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు...

తనకు సెల్ఫీ ఇవ్వాలని, ఫోటో తీసేంతవరకూ తనవైపు తిరిగాలని గోల చేస్తూ కమ్లేశ్ నాగర్‌కోట్‌ని ఇబ్బందిపెట్టడం మొదలెట్టాడు. టీమ్ బాల్కనీ నుంచి దీన్ని గమనించిన విరాట్ కోహ్లీ, బయటికి వచ్చి ‘ఎందుకు అతన్ని విసిగిస్తున్నావ్...’ అంటూ నిలదీశాడు. దానికి అతను తానేం విసిగించడం లేదని... ఫోటో ఇవ్వాలని అడుగుతున్నానంటూ సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు...

‘అతను మ్యాచ్ కోసం ఇక్కడికి వచ్చాడు... నీకోసం కాదు...’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది... ఇదిలా ఉండగా విరాట్ కోహ్లీ సెంచరీ కోసం దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. ఐపీఎల్‌లో కానీ, టీమిండియా తరుపున టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో కానీ సెంచరీ చేయలేకపోతున్న విరాట్ కోహ్లీ, లీస్టర్‌షైర్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ మూడంకెల స్కోరును అందుకోలేకపోయాడు...

శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా వికెట్లు త్వరత్వరగా కోల్పోవడంతో 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో విరాట్ కోహ్లీ 69 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచు ఆడుతున్న 21 ఏళ్ల రోమన్ వాకర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. అంపైర్ అవుట్‌గా ప్రకటించినా విరాట్ కోహ్లీ ఆ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది.. 

click me!