కోహ్లికి ధోని అండ ఉంది.. అందుకే అతడు నెంబర్ వన్.. మా దేశంలో అంతా కుల్లుబోతులే : పాక్ మాజీ ఆటగాడి సంచలన ఆరోపణలు

By Srinivas MFirst Published Jun 25, 2022, 4:28 PM IST
Highlights

Ahmed Shehzad: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి  మాజీ సారథి ఎంఎస్ ధోని అండ ఉందని.. అందుకే అతడు ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడిగా ఎదిగాడని కానీ పాకిస్తాన్ లో మాత్రం ఎవరైనా ఎదుగుతుంటే తొక్కేయాలని చూసే బ్యాచ్ ఉందని.. 

పాకిస్తాన్ లో పుట్టడం తన దురదృష్టమంటున్నాడు ఆ జట్టు మాజీ ఆటగాడు  అహ్మద్ షెహజాద్. చూడటానికి  విరాట్ కోహ్లి పోలికలు ఎక్కువగా ఉండే ఈ పాక్ మాజీ  బ్యాటర్.. అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పుడు ఓ వెలుగు వెలిగాడు. 2009 నుంచి 2016 వరకు పాక్ తరఫున ఆడిన అతడిపై తర్వాత వేటు పడింది. అయితే టీమిండియాలో మాదిరిగా జట్టులో కొత్తగా వచ్చిన ఆటగాళ్లకు ప్రోత్సాహం అందించే సంస్కృతి పాకిస్తాన్ క్రికెట్ లో లేదని.. అక్కడ ఒక ఆటగాడు ఎదుగుతుంటే అతడిని ఎట్ల తొక్కేయాలనే దానిమీదే సీనియర్లు, మాజీ ఆటగాళ్లు కుట్రలు పన్నుతుంటారని వ్యాఖ్యానించాడు. 

తాజాగా ఓ పాకిస్తాన్ ఛానెల్ తో షెహజాద్ మాట్లాడుతూ.. ‘నేనిది గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. విరాట్ కోహ్లి కెరీర్ ఈ రేంజ్ లో ఉండటానికి ఎంఎస్ ధోనినే కారణం.  కోహ్లి ఫామ్ కోల్పోయినప్పుడు ధోని అతడికి అండగా నిలబడ్డాడు...

పలుమార్లు విరాట్ విఫలమైనా ధోని అతడికి అవకాశాలిచ్చాడు. కానీ పాకిస్తాన్ లో అలా కాదు. ఒక ఆటగాడు ఎదుగుతున్నాడంటే జట్టులోని సీనియర్లు, మాజీ క్రికెటర్లు ఓర్వలేరు. ఇతరుల సక్సెస్ ను వాళ్లు డైజెస్ట్ చేసుకోలేరు. ఈ దుస్థితి దాపురించడం పాకిస్తాన్ క్రికెట్ చేసుకున్న దురదృష్టం..’ అని అన్నాడు. 

పాకిస్తాన్ మాజీ హెడ్ కోచ్ వకార్ యూనిస్ వల్లే తన క్రికెట్ కెరీర్ సర్వనాశనమైందన్నాడు షెహజాద్. యూనిస్ పంపిన లేఖ వల్లే తాను పాక్ జట్టులోకి రాలేకపోయానని చెప్పాడు. 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత యూనిస్ ఖాన్.. షెహజాద్ తో పాటు ఉమ్రాన్ మాలిక్ లను జట్టునుంచి తీసేసి దేశవాళీ ఆడిస్తే మంచిదని, వాళ్లు అక్కడ ఫామ్ అందుకున్నాక తిరిగి జాతీయ జట్టులో చేర్చాలని యూనిస్ ఖాన్ పీసీబీకి రిపోర్ట్ ఇచ్చాడు. 

దీనిపై షెహజాద్ స్పందిస్తూ..‘నేను ఆ రిపోర్డును చూడలేదు. కానీ పీసీబీ లో ఉన్న ఓ అధికారి నాకు దాని గురించి చెప్పాడు. రిపోర్టు ఇచ్చే ముందు నాతో ఒకసారి చర్చించాలి కదా. నా తప్పులేంటో నాకు చెప్పాలి కదా. నేను అగ్రెసివ్ గా ఉండటం మూలానా జట్టులో నావల్ల గొడవలు వస్తున్నాయని రిపోర్టులో రాశాను. అదే విషయాన్ని నాకు చెబితే నేను పద్ధతి మార్చుకునేవాడిని. రిపోర్టు తర్వాత వాళ్ల మాటలు నన్ను చాలా బాధించాయి..’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇది అప్పటికప్పుడు జరిగింది కాదని.. ముందుగా ప్లాన్ చేసిన కుట్ర అని ఆరోపించాడు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా మా కెరీర్ లను వకార్ యూనిస్ నాశనం చేశాడని చెప్పాడు. 

 

𝗘𝗫𝗖𝗟𝗨𝗦𝗜𝗩𝗘: Ahmed Shehzad has made a bold statement claiming that senior players in Pakistan are not supportive and cannot stomach the success of new players. 👀

Read more: https://t.co/hRILyzEBms pic.twitter.com/qXCFJRmcah

— Cricket Pakistan (@cricketpakcompk)

2009 లో 17 ఏండ్లకే పాకిస్తాన్ జట్టులోకి వచ్చిన అహ్మద్.. టాపార్డర్ లో బ్యాటింగ్ కు వచ్చేవాడు. పాకిస్తాన్ తరఫున అతడు 13 టెస్టులు, 81 వన్డేలు, 59 టీ20లు ఆడాడు. 2016లో టీ20  వరల్డ్ కప్ అనంతరం అతడిపై వేటు పడింది. చివరిసారి 2019 లో పాక్ తరఫున టీ20 ఆడిన షెహజాద్ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. 

click me!