Rohit Sharma: ఫ్యాట్ టు ఫిట్.. బరువు తగ్గిన కొత్త కెప్టెన్.. లక్ష్యం కోసం జిమ్ లో చెమటోడుస్తున్న హిట్ మ్యాన్

By Srinivas MFirst Published Jan 20, 2022, 11:47 AM IST
Highlights

Rohit Sharma Reduced Weight: ప్రస్తుతం  జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో ఉన్న  హిట్ మ్యాన్.. ఇప్పటికే 6 కిలోల దాకా తగ్గాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తో పాటు  వచ్చే ఏడాది  వన్డే  ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో...  
 

పరిమిత ఓవర్లలో టీమిండియాకు కెప్టెన్ గా ఇటీవలే నియమితుడైన  రోహిత్ శర్మ..  భారత్ పెట్టుకున్న భారీ లక్ష్యం కోసం జిమ్ లో చెమటోడ్చుతున్నాడు. కొంచెం బొద్దుగా ఉండే రోహిత్ శర్మ.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగిస్తున్నాడు. ‘బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్’ అంటూ అతడిపై  టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి అభిమానులు చేసే కామెంట్లను సవాల్ గా తీసుకుని.. ఎక్స్ ట్రా ఫ్యాట్ ను కరిగించాడు. ప్రస్తుతం  జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో ఉన్న  హిట్ మ్యాన్.. ఇప్పటికే 6 కిలోల దాకా తగ్గాడు. అతడి కొత్త  ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో రోహిత్.. యువకుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలా కనిపిస్తున్నాడు. 

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నాటకీయ పరిణామాల మధ్య టీమిండియా వన్డే కెప్టెన్ గా నియమితుడైన రోహిత్ శర్మ..  టూర్ కు కొద్దిరోజుల ముందు  చేతికి గాయం కావడంతో   ఆ సిరీస్ కు దూరమయ్యాడు. టెస్టులకు దూరమైనా వన్డేలకు అందుబాటులో ఉంటాడని అనుకున్నా.. ఫిట్నెస్ సమస్యలు అతడిని వేధించాయి. పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో హిట్ మ్యాన్.. వన్డే సిరీస్ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది.  దీంతో కెఎల్ రాహుల్.. తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 

 

కాగా.. ఇలాగే ఉంటే  టీమిండియా పెట్టుకున్న సుదీర్ఘ లక్ష్యా (ఈ ఏడాది టీ20 ప్రపంచకప్, వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్) లను సాధించడం కష్టమని  తెలుసుకున్నాడో లేక.. భారత మాజీ సారథి విరాట్ కోహ్లి ఫిట్నెస్ మంత్రను స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో గానీ రోహిత్ శర్మ గతంలో కంటే ఫిట్ గా కనిపిస్తున్నాడు.

తాజాగా అతడు  ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్టు షేర్ చేశాడు.  ఇందులో ఎన్సీఏలోని ఫిట్నెస్ ట్రైనర్ తన్మయ్ మిశ్రాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘బ్రూస్కీతో మంచి శిక్షణ రోజు’ అని రాసుకొచ్చాడు.  

 

Great to see these two champions 🤗 Training with them is always fun 😁 pic.twitter.com/mpexyHR6of

— Shikhar Dhawan (@SDhawan25)

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకోవడంతో వాటిని కూడా రోహిత్ కే అప్పజెప్పుతారని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సునీల్ గవాస్కర్ తో పాటు మరికొందరు సీనియర్లు అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. రోహిత్ శర్మ  తరుచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కుంటాడని, అదీగాక మరో రెండేళ్లకు మించి అతడు టెస్టు క్రికెట్ ఆడటం కష్టమేనని బహిరంగంగానే  వ్యాఖ్యానించారు.  ఈ నేపథ్యంలో విమర్శలను సవాల్ గా తీసుకున్న  హిట్ మ్యాన్.. తనను తాను మలుచుకుంటున్నాడు. వెస్టిండీస్ తో సిరీస్ కల్లా పూర్తి ఫిట్నెస్ సాధించి.. తద్వారా విమర్శకుల నోళ్లు మూయించాలని అతడు భావిస్తున్నాడు. 

click me!