Ind Vs SA: విరాట్ కోహ్లీతో సౌతాఫ్రికా వన్డే సారథి గొడవ.. ఎందుకలా చేస్తున్నావంటూ ఆగ్రహం..

By Srinivas MFirst Published Jan 20, 2022, 10:42 AM IST
Highlights

India Vs South Africa 1st ODI: మైదానంలో తన పని తాను చేసుకుపోయే  విరాట్ కోహ్లి.. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు ఎవరైనా అతడిని గెలికితే మాత్రం ఉగ్రస్వరూపుడవుతాడు. అవతలి వైపు  ఏ స్థాయి ఆటగాడైనా.. కోహ్లి ట్రీట్మెంట్ ఒకేలా ఉంటుంది. 

అగ్రెసివ్ ఆటకు పర్యాయ పదంగా ఉండే  టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి.. మైదానంలో తనను ఏమననంత వరకు తన పని తాను చేసుకుంటూ పోతాడు. కానీ ప్రత్యర్థి జట్లు అతడిని గెలికితే మాత్రం అతడి లోపలి మనిషి బయటకు వస్తాడు.  ఇక ఆ సమయంలో అవతలి వ్యక్తి ఎవరనేది కోహ్లి లెక్కచేయడు. అతడికి ధీటుగా సమాధానమిస్తాడు. గతంలో పలు సందర్భాలలో ఇలాంటి ఉదంతాలు చూసిన టీమిండియా అభిమానులు... బుధవారం దక్షిణాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా మరోసారి అలాంటి అగ్రెసివ్ కోహ్లిని చూశారు.  నిన్న మ్యాచులో దక్షిణాఫ్రికా వన్డే  సారథి తెంబ బవుమా.. కోహ్లితో వాగ్వాదానికి దిగాడు. 

సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్  36వ ఓవర్ నాలుగో బంతిని షార్ట్ కవర్ దిశగా ఆడాడు బవుమా. బంతి నేరుగా  అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి చేతుల్లోకి వెళ్లింది. అయితే బాల్ ను వికెట్ కీపర్ రిషభ్ పంత్ వైపునకు వేసే ఉద్దేశంతో కోహ్లి.. అతడికి బంతిని విసిరాడు. కానీ అది కాస్తా గతితప్పి బవుమాకు తాకింది.

 

pic.twitter.com/fypjtfqCUf

— Sunaina Gosh (@Sunainagosh7)

దీంతో బవుమా  విరాట్ వైపు కోపంగా చూస్తూ... ‘నేను క్రీజులోనే ఉన్నా కదా.. అలాంటి  త్రో లు వేయనవసరం లేదు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  దీంతో చిర్రెత్తుకొచ్చిన కోహ్లి.. ‘నేనేం కావాలని  నీ పైకి బంతిని విసరలేదు. వికెట్ కీపర్ కు త్రో వేసే క్రమంలో పొరపాటున నీకు తగిలి ఉంటుంది..’ అని ఘాటు రిప్లై ఇచ్చాడు. బవుమాకు రిప్లై ఇచ్చిన తర్వాత కోహ్లి.. అసహనంగా ఉండటం వీడియోలో చూడచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

సచిన్ ను దాటిన కోహ్లి : 

రికార్డుల రారాజు  విరాట్ కోహ్లి మరో  అరుదైన ఘనత సాధించాడు.  పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో అతడు.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచులో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దకు చేరగానే.. వన్డే ఫార్మాట్ లో విదేశాల్లో అత్యధిక పరుగులు (5,065)  చేసిన సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు.  సచిన్ టెండూల్కర్.. 146 ఇన్నింగ్సులలో 37.24 సగటుతో 5,065 పరుగులు చేశాడు. ఇక కోహ్లి 104 ఇన్నింగ్సులలోనే 58.04 సగటుతో 5,108 పరుగులు సాధించాడు. 

కాగా బుధవారం  ముగిసిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా.. టీమిండియా పై 31 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు తరఫున  బవుమా (110), వాన్ డర్ డసెన్ (129 నాటౌట్) లు సెంచరీలతో కదం తొక్కారు. భారత  బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కున్న ఈ ఇద్దరూ.. నాలుగో వికెట్ కు రికార్డు స్థాయిలో 204 పరుగులు జోడించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు మాత్రమే చేసింది. ఛేదనలో ఓపెనర్ శిఖర్ ధావన్ (79), కోహ్లి (51), శార్దూల్ ఠాకూర్ (50 నాటౌట్) రాణించినా మిడిలార్డర్ ఘోర వైఫల్యంతో భారత్ కు ఓటమి  తప్పలేదు. శుక్రవారం ఇదే వేదికపై  రెండో వన్డే జరుగనుంది. 
 

click me!