
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్-2022లో భాగంగా యువ భారత జట్టు కెప్టెన్ యశ్ ధుల్ తో పాటు ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారీన పడ్డా.. టీమిండియా కుర్రాళ్లు మాత్రం తమ పోరాటాన్ని ఆపలేదు. కీలక సభ్యులకు కరోనా నిర్ధారణ అయినా.. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచులో అద్భుతంగా ఆడి ఘన విజయాన్ని అందుకున్నారు. ట్రినిడాడ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచులో ఐర్లాండ్ పై ఏకంగా 174 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్ నెగ్గడం ద్వారా భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకుంది.
కెప్టెన్ యశ్ ధుల్ సహా వైస్ కెప్టెన్ షేక్ రషీద్, మరో నలుగురు ఆటగాళ్లకు కరోనా నిర్ధారణ అయిన వేళ భారత కుర్రాళ్లు ఈ మ్యాచులో ఎలా ఆడతారో అనే సందేహం అందరినీ వెంటాడింది. కానీ మన కుర్రాళ్లు మాత్రం ఇరగదీసే ప్రదర్శన చేశారు. నిశాంత్ సంధు కెప్టెన్సీలో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 307 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓపెనర్లుగా వచ్చిన హర్నూర్ సింగ్ (88), రఘువంశీ (79) లు టీమిండియా భారీ స్కోరు సాధించేందుకు బాటలు వేశారు. ఈ ఇద్దరూ తొలి వికెట్ కు 164 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ వెనువెంటనే వెనుదిరిగినా.. రాజ్ (42), కెప్టెన్ నిశాంత్ (36), రాజ్యవర్ధన్ హంగర్గ్రేకర్ (39) లు ఆఖర్లో ధాటిగా ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్.. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. తొలి 20 ఓవర్లలోపే ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. స్కాట్ మెక్ బెత్ (32) ఒక్కడే టాప్ స్కోరర్. మిగిలిన వారంతా రెండంకెల స్కోరు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఫలితంగా 39 ఓవర్లలో 133 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. తాంబే, అనిశ్వర్ గౌతమ్, గర్వ్ సంగ్వన్ లు తలో రెండు వికెట్లు తీయగా.. రాజ్యవర్ధన్, రవికకుమార్ లు చెరో వికెట్ పడగొట్టారు. దీంతో భారత్ 174 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.