
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దానికి ముందు జరిగే ఆసియా కప్ 2023 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఆగస్టు నెలాఖరున మొదలయ్యే ఆసియా కప్ 2023 టోర్నీకి ఆగస్టు 16న జట్టును ప్రకటించనుంది బీసీసీఐ..
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగియగానే స్వదేశానికి తిరిగి వచ్చిన రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఆసియా కప్ 2023 టోర్నీలో బరిలో దిగుతోంది టీమిండియా. టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు..
విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్ శుబ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు ఆసియా కప్ 2023 టోర్నీలో చోటు దక్కడం గ్యారెంటీ. వీరితో పాటు ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన సీనియర్ బ్యాటర్ కెఎల్ రాహుల్, ఐర్లాండ్ టూర్‌కి ఎంపికైన సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాలకు ఆసియా కప్ 2023 టోర్నీలో చోటు దక్కనుంది..
వీరితో పాటు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్న ఇషాన్ కిషన్‌లకు ఆసియా కప్ 2023 టోర్నీలో చోటు దక్కనుంది. ఆగస్టు 23 వరకూ ఐర్లాండ్ పర్యటనలో ఉండనుంది టీమిండియా.
వెస్టిండీస్ టూర్ తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లు స్వదేశానికి తిరిగి వచ్చినా జస్ప్రిత్ బుమ్రాతో పాటు సంజూ శాంసన్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ప్లేయర్లు, ఐర్లాండ్ టూర్‌లో చోటు దక్కించుకున్నారు. సంజూ శాంసన్‌కి ఆసియా కప్ 2023 టోర్నీలో స్టాండ్ బై ప్లేయర్‌గా అయినా చోటు దక్కే అవకాశం ఉంది.
ఆసియా కప్ 2023 టోర్నీ నుంచి 8 రోజుల ముందే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో బీసీసీఐ క్యాంపులో పాల్గొనబోతున్నారు భారత క్రికెటర్లు. ఆగస్టు 24 నుంచి 29 వరకూ ఎన్‌సీఏ క్యాంపులో పాల్గొనే భారత జట్టు, ఆ తర్వాత ఆగస్టు 30న శ్రీలంకకు బయలుదేరుతుంది..
హై బ్రీడ్ మోడల్‌లో జరిగే ఆసియా కప్ 2023 టోర్నీలో 4 మ్యాచులు పాకిస్తాన్‌లో జరుగుతుంటే, మిగిలిన 9 మ్యాచులకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. టీమిండియా ఆడే మ్యాచులన్నీ శ్రీలంకలోనే జరుగుతాయి. సెప్టెంబర్ 2న పల్లెకేలేలో ఇండియా, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2023 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 4న ఇదే వేదికలో నేపాల్‌తో మ్యాచ్ ఆడుతుంది టీమిండియా..
నేపాల్, ఆసియా కప్ టోర్నీకి మొదటిసారిగా అర్హత సాధించింది. దీంతో గ్రూప్ A నుంచి ఇండియా, పాకిస్తాన్.. సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించడం దాదాపు ఖాయమే. ఇదే జరిగితే సెప్టెంబర్ 10న కొలంబోలో ఇండియా, పాకిస్తాన్ మధ్య సూపర్ 4 రౌండ్ మ్యాచ్ జరుగుతుంది.
ఆసియా కప్ 2023 టోర్నీకి భారత జట్టు ఇలా ఉండొచ్చు (అంచనా): రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్