India Vs New Zealand: ‘ది వాల్’ తో కలిసి పని ప్రారంభించిన హిట్ మ్యాన్.. నెట్స్ లో చెమటోడుస్తున్న కొత్త సారథి

By team teluguFirst Published Nov 16, 2021, 6:19 PM IST
Highlights

India Vs New Zealand: రోహిత్ సారథ్యంలోని టీమిండియా కుర్రాళ్లంతా ఇప్పటికే జైపూర్ లో చెమటోడ్చుతున్నారు.  కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఈ బృందం.. తమ ప్రాక్టీస్ ను ఆరంభించింది. రేపటి మ్యాచ్ లో చెలరేగాలని చూస్తున్నది.

టీ20 ప్రపంచకప్ లో పేలవ ప్రదర్శన అనంతరం భారత జట్టు రేపటి నుంచి వరల్డ్ కప్ రన్నరప్స్ న్యూజిలాండ్ ను ఢీకొనబోతున్నది. కివీస్ తో టీమిండియా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే  వరల్డ్ కప్ లో దారుణ ప్రదర్శనతో టీమిండియా అభిమానులను తీవ్ర నిరాశపరిచిన భారత జట్టు.. తమను సెమీస్ కు వెళ్లకుండా అడ్డుకున్న న్యూజిలాండ్  పని పట్టాలని భావిస్తున్నది. టీ20 సిరీస్ తో పాటు టెస్టు లలోనూ వాళ్లను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నది.  టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ తప్పుకోవడంతో టీమిండియాకు కొత్త  సారథిగా రోహిత్ శర్మ ఎంపికైన విషయం తెలిసందే. హిట్ మ్యాన్ తో పాటు కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా భారత జట్టును తిరిగి గాడిలోకి పెట్టేందుకు నెట్స్ లో శ్రమిస్తున్నాడు.

నవంబర్ 14న యూఏఈ నుంచి స్వదేశానికి చేరిన టీమిండియా ఆటగాళ్లు. జైపూర్ కు వెళ్లారు. పలువురు సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్ లో భారత జట్టు ఐపీఎల్ లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ లను ఎంపిక చేసింది.  రోహిత్ సారథ్యంలోని ఈ కుర్రాళ్లంతా ఇప్పటికే జైపూర్ లో చెమటోడ్చుతున్నారు.  కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఈ బృందం.. తమ ప్రాక్టీస్ ను ఆరంభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది. 

వీడియోలో రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ద్రావిడ్.. రోహిత్ కు బౌలింగ్ చేస్తూ కనిపించాడు.  రోహిత్  కూడా తాను ఎదుర్కున్న బంతులను షాట్లుగా మలుస్తూ ఆత్మ విశ్వాసంగా కనిపించాడు. సరైన టైమింగ్ తో షాట్స్ ఆడుతూ.. సహచరులైన కెఎల్ రాహుల్, ఇతర ఆటగాళ్లతో కలిసిపోయాడు.

 

get into the groove for the T20I series. 👌 👌

How excited are you to see them in action? 👏 👏 pic.twitter.com/Q3sNrdjnYA

— BCCI (@BCCI)

బీసీసీఐ ఈ వీడియోను పంచుకుంటూ.. ‘కొత్త బాధ్యతలు..  కొత్త సవాళ్లు.. కొత్త ప్రారంభం..’ అంటూ వ్యాఖ్యానించింది.  విరాట్ వారసుడిగా రోహిత్ కు ఇదే పూర్తిస్థాయి టీ20  కెప్టెన్సీ. అలాగే ఇన్నాళ్లు రాను.. రాను అన్న ద్రావిడ్ కూడా ఎట్టకేలకు  బీసీసీఐ బాస్ గంగూలీ అభ్యర్థన మేరకు టీమిండియాతో చేరాడు. ప్రశాంతంగా ఉంటూనే విధ్వంసం సృష్టించడంలో దిట్టగా పేరున్న ఈ ఇద్దరు.. టీమిండియాకు ఎలాంటి విజయాలు అందిస్తారో కాలమే నిర్ణయించనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ ఈ ఇద్దరికీ తొలి సవాల్. బ్యాటింగ్ కు అనుకూలించే జైపూర్ పిచ్ పై హిట్ మ్యాన్ చెలరేగితే కివీస్ కు కష్టాలు తప్పవు. 

 

ఇదిలాఉండగా.. కీలక సిరీస్ ముందు  కివీస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు సారథి కేన్ విలియమ్సన్.. సిరీస్ నుంచి తప్పుకున్నాడు. మూడు టీ20లకు అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు. కేన్ మామ స్థానంలో టిమ్ సౌథీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్నాడు. కేన్ విలియమ్సన్.. తిరిగి టెస్టు సిరీస్ నుంచి అందుబాటులో ఉంటాడు.

click me!