
ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 సీజన్ల పాటు ఒక జట్టుతో ఉన్న ఆటగాడు ఉన్నట్టుండి ఆ ఫ్రాంచైజీ నుంచి వెళ్లిపోవడం ఎవరికైనా బాధే. ఒక కుటుంబంలా కలిసిఉన్న సభ్యులందరినీ విడిచి ఇతర జట్లకు వెళ్లి ఆడటం కొంతవరకు ఇబ్బందే. ప్రస్తుతం అదే మూడ్ లో ఉన్నాడు ఆర్సీబీ మాజీ ఆటగాడు ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. గతేడాది ముగిసిన రిటెన్షన్ ప్రక్రియతో పాటు వేలం లో కూడా ఆర్సీబీ అతడిని దక్కించుకోలేదు. కానీ అతడు ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన ఫ్రాంచైజీ రాజస్థాన్ మాత్రం చాహల్ ను కావాలనుకుంది. కాగా.. రిటెన్షన్ సందర్భంగా చాహల్ డబ్బులు ఎక్కువ అడిగాడని, అందుకే ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదని వస్తున్న వార్తలు.. ఆర్సీబీతో ఎమోషనల్ బాండింగ్, టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కెప్టెన్సీ, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ ఇతర విషయాల గురించి అతడు మాట్లాడాడు.
ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. ‘2010లో నేను రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిని. అయితే నేను జట్టు సభ్యుడినే కానీ తుది జట్టులో చోటు దక్కలేదు. మళ్లీ పదేండ్ల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. రాజస్థాన్ కు తిరిగి ఆడుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఒకరకంగా ఇది నా మొదటి ఫ్యామిలీ. నా ఐపీఎల్ ప్రయాణం ఇక్కడే మొదలైంది. అశ్విన్ భయ్యాతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది.
ఆర్సీబీతో ఆడకపోవడం గురించి..
ఆర్సీబీతో నాకు చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఆ జట్టు తరఫున నేను చాలా మ్యాచులు ఆడాను. అసలు ఐపీఎల్ లో మరే ఇతర జట్టుతో ఆడతానని నేనైతే కలలో కూడా ఊహించలేదు. అంతగా ఆ జట్టుతో, అక్కడి అభిమానులతో కలిసిపోయాను. సోషల్ మీడియాలో గానీ బయట గానీ ఆర్సీబీ అభిమానులంతా నన్ను.. ‘నువ్వు ఎక్కువ డబ్బులు ఎందుకడిగావన్న...?’ అని అడుగుతున్నారు. కానీ అందులో నిజం లేదు. వాస్తవంగా జరిగిందేంటంటే.. మైక్ హెస్సన్ (ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్) రిటెన్షన్ ప్రక్రియకు కొన్ని రోజుల ముందు నాకు ఫోన్ చేసి.. ‘యుజీ విను.. మనకు మూడు రిటెన్షన్ ఉన్నాయి. మేం విరాట్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మహ్మద్ సిరాజ్ లను రిటైన్ చేసుకుంటున్నాం..’ అని చెప్పాడు.
నన్ను రిటైన్ చేసుకునేది గానీ, వేలంలో దక్కించుకుంటామని గానీ చెప్పలేదు. కేవలం తీసుకోబోతున్న ముగ్గురు ఆటగాళ్ల పేర్లు మాత్రమే చెప్పాడు. ఒకవేళ వాళ్లు నాతో ‘నిన్ను మేం వేలంలో దక్కించుకుంటాం..’ అని చెప్పి ఉంటే సంతోషంగా యెస్ చెప్పేవాన్ని. డబ్బు నాకు సెకండరీ. కానీ వాళ్లు నాతో అలా చెప్పలేదు. అయితే ఆర్సీబీ యాజమాన్యం సంగతి పక్కనబెడితే ఆ జట్టు అభిమానులను మాత్రం నేనెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా.
మరి ఇప్పుడు రాజస్థాన్ లో కూడా ఆ చాహల్ ను చూడొచ్చా..?
తప్పకుండా.. మారేది నా జెర్సీ మాత్రమే. నేను కాదు. నా నుంచి ఆర్సీబీ తరఫున ఎటువంటి ప్రదర్శనలు చేశానో ఇక్కడ కూడా అదే చేస్తా. అందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. వేలంలో రాజస్థాన్ నామీద నమ్మకముంచి నన్ను దక్కించుకుంది. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి కదా.
రోహిత్, కోహ్లిలతో అనుబంధంపై..
రోహిత్ భాయ్ ను నేను ప్రేమగా రోహితా అని పిలుస్తాను. 2013లో నేను ముంబై ఇండియన్స్ లో ఉన్నప్పుడు రోహిత్ తో కలిసి ఆడాను. అప్పట్నుంచి అతడితో చాలా సన్నిహితంగా ఉంటాను. అప్పటికీ ఇప్పటికీ రోహిత్ భాయ్ లో మార్పులేమీ లేవు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో హిట్ మ్యాన్ ఎప్పుడూ ముందుంటాడు. రోహిత్ భయ్యాను నేను గుడ్డిగా నమ్ముతా. అతడంటే అంతిష్టం నాకు..
ఇక కోహ్లి గురించి చెప్పాలంటే.. అతడు నా కెప్టెన్. కోహ్లి భయ్యా సారథ్యంలో నేను వందలాది మ్యాచులు ఆడాను. అది ఆర్సీబీకి అయినా టీమిండియాకు అయినా.. కోహ్లి నాకు పూర్తి స్వేచ్ఛనిస్తాడు. వేలంలో నేను రాజస్థాన్ కు వెళ్లినప్పుడు అతడు నాకు ఫోన్ చేశాడు. ‘ఇక రాయల్ వి అయ్యావన్న మాట..’ అని చెప్పాడు.
టీమిండియా కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో ఎప్పుడైనా ఏదైనా మాట్లాడొచ్చు. అతడి దగ్గర సమాధానం దొరకని ప్రశ్నే లేదు. రాహుల్ సార్ నేతృత్వంలో నేను ఇండియా-ఎ కు ఆడాను. శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా రాహుల్ సార్ నా దగ్గరికొచ్చి.. ‘యుజీ, కొత్త వాళ్లకు ఛాన్సిస్తున్నాం...’ అని చెప్పాడు. ఒక హెడ్ కోచ్ వచ్చి సాధారణ ఆటగాడికి ఆ విషయం చెప్పడమనేది చాలా పెద్ద విషయం. ఎవరితోనో అది చెప్పించవచ్చు. కానీ స్వయంగా ఆయనే నా దగ్గరికి వచ్చి చెప్పారు. ఆయనుంటే డ్రెస్సింగ్ రూమ్ అంతా పాజిటివిటీ ఉంటుంది. రాహుల్ సార్.. విరాట్ భాయ్ ను, రోహిత్ భాయ్ ను గానీ, ఇతర ఆటగాళ్లను గానీ వేరు చేసి చూడడు. ఆయనకు అందరూ సమానమే....’ అని చాహల్ తెలిపాడు.
2010లో ఐపీఎల్ లోకి ఎంట్రీ (రాజస్థాన్ రాయల్స్.. కానీ ఆ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు) ఇచ్చిన చాహల్.. 2013లో ముంబై ఇండియన్స్ తరఫున ఒక్క మ్యాచ్ ఆడాడు. ఇక 2014 నుంచి 2021 దాకా ఆర్సీబీతోనే ఉన్నాడు. మొత్తంగా చాహల్.. 114 మ్యాచులాడితే 113 ఆర్సీబీ (ఒక్కటి ముంబై తరఫున) తరఫునే ఆడాడు. ఇందులో 139 వికెట్లు తీసుకున్నాడు.ఇవన్నీ విరాట్ కోహ్లి సారథ్యంలోనే కావడం గమనార్హం.