జాతీయ జట్టుతో నా అనుబంధం తీరిపోయింది. ఇక సెలవు..! దక్షిణాఫ్రికాకు మరో షాక్ ఇచ్చిన క్రిస్ మోరిస్

By team teluguFirst Published Oct 28, 2021, 12:23 PM IST
Highlights

T20 Worldcup: సౌతాఫ్రికా ఆల్ రౌండర్.. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న క్రిస్ మోరిస్ తాను రిటైర్ అవుతున్నట్టు చెప్పకనే చెప్పాడు.  ఇక జాతీయ జట్టు (దక్షిణాఫ్రికా) తో తన అనుబంధం ముగిసినట్టే అని స్పష్టం చేశాడు. 

రెండ్రోజుల క్రితం ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 Worldcup) లో భాగంగా వెస్టిండీస్ (West Indies) తో జరిగిన మ్యాచ్ లో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ గురించి ఆ జట్టు వికెట్ కీపర్ డికాక్ (de kock) వివాదం మరిచిపోకముందే  ప్రొటీస్ టీమ్ కు మరో షాక్ తగిలింది. సౌతాఫ్రికా (South africa) ఆల్ రౌండర్.. ఐపీఎల్ (IPL) లో రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals)తరఫున ఆడుతున్న క్రిస్ మోరిస్ (Chris Morris) తాను రిటైర్ అవుతున్నట్టు చెప్పకనే చెప్పాడు.  ఇక జాతీయ జట్టు (దక్షిణాఫ్రికా) తో తన అనుబంధం ముగిసినట్టే అని స్పష్టం చేశాడు. 

ఇందుకు సంబంధించి మోరిస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికా జాతీయ జట్టు కోసం నేను ఆడే రోజులు పూర్తయ్యాయి. ఈ రిటైర్మెంట్ విషయాలను అధికారికంగా ప్రకటించేవాడిని కాదు. నేను ఎక్కడ ఉంటానో (దక్షిణాఫ్రికా బోర్డు ను ఉద్దేశిస్తూ..) వాళ్లకు తెలుసు. అలాగే నేను ఎక్కడ నిలబడగలనో నాకు తెలుసు. కానీ జాతీయ జట్టు కోసం ఆడే రోజులు మాత్రం పూర్తయ్యాయి’ అని అన్నాడు. 

Latest Videos

34 ఏండ్ల ఈ ప్రొటీస్ ఆల్ రౌండర్.. దక్షిణాఫ్రికా తరఫున 2012లో క్రికెట్ లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు అతడు 42 వన్డేలు, 23 టీ20లు, నాలుగు టెస్టులు ఆడాడు. జాతీయ జట్టు తరఫున అతడి చివరి వన్డే.. 2019 ప్రపంచకప్ లో ఆడాడు. ఈ టోర్నీలో సౌతాఫ్రికా లీగ్ స్టేజ్ నుంచే నిష్క్రమించడం గమనార్హం. 

అయితే జాతీయ జట్టు నుంచి తప్పుకుంటున్న తాను .. దేశవాళీ క్రికెట్, టీ20 లీగ్ ల మీద దృష్టి పెడతానని అన్నాడు. మోరిస్ ప్రకటన చూస్తే.. అతడి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్టే అని చెప్పకనే చెప్పాడు. ఇదే విషయమై అతడు మాట్లాడుతూ.. ‘అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించేది ఏమీ లేదు. నేను దేశవాళీ క్రికెట్ మీద దృష్టి సారించాలనుకుంటున్నాను. దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లకు ఆడాను. నా దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం నాకు గర్వంగా ఉంది’ అని అన్నాడు. 

ఇదిలాఉండగా.. యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా తరఫున మోరిస్ తుది జట్టులో లేడు. మోరిస్ తో పాటు స్టార్ ఓపెనర్ డూప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ లను కూడా ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికాలో బోర్డు, ఆటగాళ్ల మధ్య కొంతకాలంగా సఖ్యత కొరవడింది. ఇదే విషయమై మోరిస్ మాట్లాడుతూ.. ‘నేను ఎవరితో మాట్లాడాలో  వారితో మాట్లాడాను. కానీ క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) తో మాత్రం ఇంతవరకు మాట్లాడలేదు. ఇక డూప్లెసిస్, ఇమ్రాన్ ల గురించి  నేను కామెంట్ చేయడానికి ఏమీలేదు. మాతో  బోర్డు ఎలా వ్యవహరిస్తుందన్న విషయం గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఈ విషయమై నేను ఏడాదిన్నరగా మౌనంగానే ఉంటున్నాను. ఒకవేళ నేను  కామెంట్ చేసినా ఏం జరుగుతుందో నాకు తెలుసు’ అంటూ బోర్డు వ్యవహారాలను బహిరంగంగానే విమర్శించాడు. 

ఇక మంగళవారం నాటి  వెస్టిండీస్ పోరులో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి సంఘీభావంగా దక్షిణాఫ్రికా జారీ చేసిన ఆదేశాలను తాను పాటించలేనని ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ డికాక్.. ఏకంగా మ్యాచ్ నుంచే తప్పుకున్నాడు. ఇప్పుడీ వివాదం రచ్చ అవుతున్నది. టీ20 టోర్నీ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా బోర్డుకు ఆటగాళ్లకు మధ్య ఎన్ని వివాదాలు తలెత్తుతాయో అని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

click me!