T20 Worldcup: ఇది కదా డ్రీమ్ ఓవర్.. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు.. నమీబియా బౌలర్ సంచలనం

By team teluguFirst Published Oct 28, 2021, 11:41 AM IST
Highlights

Namibia vs Scotland: బుధవారం స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ మొత్తానికి నమీబియా పేస్ బౌలర్ రూబెన్ ట్రంపుల్మెన్  వేసిన తొలి ఓవర్ హైలైట్ గా నిలిచింది.

టీ20 ప్రపంచకప్ (T20 Worldcup) క్వాలిఫయింగ్ రౌండ్ లో అదరగొట్టే ప్రదర్శనతో సూపర్-12 కు అర్హత సాధించిన నమీబియా (Namibia).. తాను ఆడుతున్న తొలి మ్యాచ్ లోనూ అద్భుత  ఆటతీరుతో ఆకట్టుకుంది. బుధవారం స్కాట్లాండ్ (Scotland) తో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ మొత్తానికి నమీబియా పేస్ బౌలర్ రూబెన్ ట్రంపుల్మెన్ (ruben Trumplmann)  వేసిన తొలి ఓవర్ హైలైట్ గా నిలిచింది. బౌలర్లంతా కలలు కనే డ్రీమ్ ఓవర్ గా నిలిచింది. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీయడమంటే మాటలా..? 

టాస్ నెగ్గిన నమీబియా.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. స్కాట్లాండ్ బ్యాటర్లు క్రీజులోకి వచ్చారు. గ్రూప్ స్టేజ్ లో అద్భుతాలు సృష్టించిన స్కాట్లాండ్.. తొలి మ్యాచ్ లో అఫ్ఘానిస్థాన్ తో ఓడిపోయినా.. నిన్నటి మ్యాచ్ లో పుంజుకుంటుందని అంతా భావించారు. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు ఇంకా కుదురుకోలేదు.  రూబెన్ బంతిని అందుకున్నాడు. 

తొలి బంతికి మున్సీ బౌల్డ్. గుడ్ లెంగ్త్ డెలివరీ ని ఎలా ఆడాలో తెలియక మున్సీ బోల్తా కొట్టాడు.  రెండో బంతి వైడ్. తర్వాత బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతి వైడ్. నాలుగో బంతికి  మరో వికెట్. ఐదో బంతికి స్కాట్లాండ్ తాత్కాలిక కెప్టెన్ బెర్రింగ్టన్ ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. రూబెన్ హ్యాట్రిక్ పడటం ఖాయం అనుకున్నారంతా. కానీ క్రెయిగ్ విలియమ్స్ అతడిని అడ్డుకున్నాడు. అంతే.. తొలి ఓవర్ ముగిసేసరికి స్కోరు 3 వికెట్లు కోల్పోయి 2 పరుగులు.  మొత్తంగా నాలుగు ఓవర్లు వేసిన రూబెన్.. 17 పరుగులే ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది. ఈ డ్రీమ్ ఓవర్ ను మీరూ చూసేయండి మరి.. 

 

ఆ తర్వాత స్కాట్లాండ్ కోలుకున్నా..  నమీబియా ముందు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.  స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి నమీబియా కష్టపడాల్సి వచ్చింది. రాత్రి పూట కురుస్తున్న మంచును స్కాట్లాండ్ బౌలర్లు బాగానే సద్వినియోగం చేసుకుని నమీబియా బ్యాటర్ల మీద ఒత్తిడి తెచ్చారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ వారి మీద ఒత్తి పెంచారు. కానీ స్మిట్, క్రెయిగ్ విలియమ్స్ ల పోరాటంతో నమీబియాను విజయం వరించింది. 

ఇది కూడా చదవండి: T20 Worldcup: ఉత్కంఠభరిత పోరులో నమీబియాదే గెలుపు.. స్కాట్లాండ్ కు రెండో ఓటమి..

ఆఖరివరకు ఉత్కంఠగా సాగిన పోరులో నమీబియా విజయం సాధించినా ప్రేక్షకులకు మాత్రం అసలైన టీ20 మజా దక్కింది.  పెద్ద జట్లతో సమానంగా ప్రేక్షకులను అలరించడంతో తామూ తీసిపోలేదని నమీబియా, స్కాట్లాండ్ రుజువు చేశాయి. రెండు ఓవర్లలో 8 పరుగులు కొట్టాల్సిన దశలో స్మిట్ ఫోర్ కొట్టడం.. ఆ తర్వాత వికెట్ కోల్పోవడం.. ఇవన్నీ ఆటలో నాటకీయతను పెంచాయి.

click me!