T20 worldcup 2021: టీమిండియాతో మ్యాచ్... 12 మందితో కూడిన జట్టును ప్రకటించిన పాకిస్తాన్...

By Chinthakindhi RamuFirst Published Oct 23, 2021, 2:46 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ: సూపర్ 12 రౌండ్‌లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్... ఒక రోజు ముందే 12 మందితో కూడిన జట్టును ప్రకటించిన పాక్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ లో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సూపర్ 12 రౌండ్‌లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కి ఇప్పటికే బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ తలబడడం ఇది ఆరోసారి...

2007 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా బాల్‌ అవుట్ విధానంలో విజయం అందుకుంది. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టైగా ముగియగా, విజేతను తేల్చేందుకు బాల్- అవుట్ విధానాన్ని ఎంచుకున్నారు. ఇందులో 3-0 తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు, ఫైనల్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్‌ను కైవలం చేసుకుంది...

ఇంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచుల్లోనూ భారత జట్టు, పాక్‌పై విజయం అందుకుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానంలో ఉండగా, పాక్ జట్టు మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌కి ముందు 12 మందితో కూడా జట్టును ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపరిచింది పాకిస్తాన్...

బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా వ్యవహరించే పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు. అసిఫ్ ఆలీ, ఫకార్ జమాన్, హైదర్ ఆలీ బ్యాట్స్‌మెన్లుగా.. ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదబ్ ఖాన్, షోయబ్ మాలిక్ ఆల్‌రౌండర్లుగా... హారీస్ రౌఫ్, హసన్ ఆలీ, షాహీన్ షా అఫ్రిదీ బౌలర్లుగా ఎంపికయ్యారు...

అయితే భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఒక్కరోజు ముందుగా జట్టును ప్రకటించడానికి ఇష్టపడలేదు. ‘ఉన్నంతలో పటిష్టమైన జట్టును ఎంపిక చేస్తాం. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌ను మాత్రం మ్యాచ్‌కి ముందే ప్రకటిస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేసేందుకు ఫిట్‌గా లేకపోవడంతో అతని స్థానంలో మరో బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్‌ను ఆడేంచే అవకాశం ఉంది. ఐపీఎల్‌, ఆ తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్‌తో కలిసి వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్‌ను రిజర్వు బెంచ్‌లో కూర్చొబెట్టే అవకాశం లేకపోవచ్చు...

పాకిస్తాన్‌ జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అసిఫ్ ఆలీ, ఫకార్ జమాన్, హైదర్ ఆలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హారీస్ రౌఫ్, హసన్ ఆలీ, షాహీన్ షా అఫ్రిదీ...

పాకిస్తాన్‌తో మ్యాచ్‌కి భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి/రవిచంద్రన్ అశ్విన్

click me!