
వెస్టిండీస్ టూర్‌లో ఆఖరి టీ20 మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 15.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 121 పరుగుల స్కోరు చేసింది. మొదటి మూడు మ్యాచుల్లో మాదిరిగానే ఫైనల్ మ్యాచ్‌లోనూ టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..
ఫోర్ బాది ఖాతా తెరిచిన యశస్వి జైస్వాల్, అకల్ హుస్సేన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా.
ఈ దశలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి మూడో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అల్జెరీ జోసఫ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో 4, 6, 4, 4 బాదిన తిలక్ వర్మ 19 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 51 పరుగులు చేసింది భారత జట్టు..
18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన తిలక్ వర్మ, రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన సంజూ శాంసన్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
87 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా. వెస్టిండీస్ ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ చేయడంతో రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హార్ధిక్ పాండ్యా 16 బంతుల్లో 8 పరుగులే చేశాడు. 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో సూర్యకుమార్ యాదవ్.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ అందుకున్నాడు.