టీమిండియాని తాకిన కరోనా... కెప్టెన్‌, వైస్ కెప్టెన్‌తో పాటు ఐసోలేషన్‌లో ఆరుగురు ప్లేయర్లు...

By Chinthakindhi RamuFirst Published Jan 19, 2022, 8:54 PM IST
Highlights

అండర్-19 వరల్డ్‌కప్ భారత జట్టులో కరోనా కలకలం... కెప్టెన్ యశ్ ధుల్‌తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌కి కరోనా పాజిటివ్?...

అండర్‌-19 వరల్డ్‌కప్ టోర్నీ కోసం వెస్టిండీస్‌ని వెళ్లిన భారత యువ జట్టును కరోనా వెంటాడింది. యువ భారత జట్టులో కరోనా కేసులు వెలుగుచూడడంతో ఏకంగా ఆరుగురు ప్లేయర్లు ఐసోలేషన్‌లోకి వెళ్లారు. టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌తో పాటు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కూడా కరోనా పాజిటివ్‌గా తేలిన ప్లేయర్ల ఉన్నారని సమాచారం. వీరితో మరో నలుగురు ప్లేయర్లు క్లోజ్ కాంటాక్ట్ ఉండడంతో జట్టుకి దూరమయ్యారు...

యశ్ ధుల్, రషీద్‌తో పాటు వీరితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న బౌలర్ ఆరాధ్య యాదవ్‌తో పాటు వసు వత్స్, మానవ్ ప్రకాశ్, సిద్ధార్థ్ యాదవ్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆరుగురు కీలక ప్లేయర్లు దూరం కావడంతో భారత జట్టు, మిగిలిన మ్యాచుల్లో ఎలా ఆడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 

కెప్టెన్, వైస్ కెప్టెన్ ఐసోలేషన్‌కి వెళ్లడంతో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కి నిశాంత్ సంధు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన భారత యువ జట్టుకి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెనర్లు...

అంగ్‌క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్ కలిసి తొలి వికెట్‌కి 164 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అంగ్‌క్రిష్ రఘువంశీ 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 79 పరుగులు చేసి, జెమీ ఫోర్బ్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

101 బంతుల్లో 12 ఫోర్లతో 88 పరుగులు చేసిన హర్నూర్ సింగ్‌ను మాథ్యూ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. 195 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత అండర్-19 టీమ్... ఆ తర్వాత కెప్టెన్ నిషాంత్ సంధు 34 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన బౌలర్ రాజ్ భవ 64 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసి అవుట్ కాగా, కుశాల్ తంబే 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆఖర్లో రాజవర్థన్ హంగర్కర్ 5 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 17 బంతుల్లో 39 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో భారత జట్టు.. 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 23 పరుగుల రాబట్టాడు రాజవర్థన్...

అండర్‌-19 ఆసియా కప్ టోర్నీ టైటిల్ గెలిచి, వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టింది భారత అండర్-19 జట్టు. ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్ గెలిచిన భారత యువ జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. ఐసీసీ అండర్-19 మెన్స్ వరల్డ్‌ కప్ టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది భారత యువ జట్టు...

టీమిండియా తన తర్వాతి మ్యాచ్ శనివారం జనవరి 22న యుగాండా జట్టుతో ఆడనుంది. ఐర్లాండ్‌ మాదిరిగానే యుగాండాతో మ్యాచ్ కూడా భారత జట్టుకి పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. అయితే ఆ తర్వాత జనవరి 25 నుంచి క్వార్టర్ ఫైనల్స్, 28 నుంచి సెమీ ఫైనల్స్ మ్యాచులు జరగనున్నాయి. ఆ సమయానికి భారత ప్లేయర్లు కరోనా నుంచి కోలుకోకపోతే టీమిండియాకి ఇబ్బంది ఎదురుకాక తప్పదు...

 

click me!