
నేటి నుంచి పార్ల్ వేదికగా ప్రారంభం కాబోయే తొలి వన్డేకు ముందు ఆతిథ్య దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఇటీవలే ముగిసిన టెస్టు సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఉన్న కగిసో రబాడా.. వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే ఆన్రిచ్ నార్త్జ్ సేవలను కోల్పోయిన సఫారీ జట్టు.. తాజాగా రబాడా కూడా దూరమవడంతో పేస్ బౌలింగ్ బెంచ్ బలహీనపడినట్టు అయింది. రబాడా స్థానంలో స్పిన్నర్ ఆల్ రౌండర్ జార్జ్ లిండే జట్టుతో చేరనున్నాడు. అయితే అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందా...? అనేది అనుమామనమే.. తొలి వన్డే బుధవారం 1.30 గంటల నుంచి పార్ల్ వేదికగా జరుగనున్నది.
గత కొద్ది కాలంగా తీరిక లేని క్రికెట్ ఆడుతున్న రబాడాకు ఆ జట్టు విశ్రాంతినిచ్చింది. అయితే భారత్ తో కీలక వన్డే సిరీస్ కు ముందు అతడిని తప్పించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. గతేడాది దుబాయ్ లో మొదలైన ఐపీఎల్ రెండో అంచె నుంచి అతడు తీరిక లేని క్రికెట్ ఆడాడు. ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ స్టార్ పేసర్.. ఆ టోర్నీ ముగిశాక వెంటనే టీ20 ప్రపంచకప్ లో పాల్గొన్నాడు.
టీమిండియాతో టెస్టు సిరీస్ కు ముందు రబాడా పెద్దగా ఫామ్ లో లేడు. కానీ అడపా దడపా వికెట్లు తీస్తుండటం.. కీలక సిరీస్ కావడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. అతడిని టెస్టు సిరీస్ కు ఎంపిక చేసింది. అయితే ఈ సిరీస్ లో రబాడా అదరగొట్టే ప్రదర్శన చేశాడు. మూడు టెస్టులలో కలిపి 20 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వన్డే సిరీస్ లో కూడా అతడు భారత్ కు ఇబ్బందులు సృష్టించడం ఖాయమనుకుంటున్న తరుణంలో దక్షిణాఫ్రికా జట్టు.. పనిభారం కారణంగా రబాడాకు విశ్రాంతి కల్పించడం గమనార్హం.
అయతే భారత్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా.. ఫిబ్రవరి 17 నుంచి న్యూజిలాండ్ తో ఆ తర్వాత మార్చి లో బంగ్లాదేశ్ తో టెస్టు మ్యాచులు ఆడనుంది. దీంతో రబాడాకు కొద్దిగా బ్రేక్ ఇవ్వడం బెటరని టీమ్ మేనేజ్మెంట్ భావించినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.
రబాడా, నార్త్జ్ లేకపోవడంతో యువ పేసర్ మార్కో జాన్సేన్ కు సువర్ణావకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది. భారత్ తో టెస్టు సిరీస్ లో రాణించిన జాన్సేన్.. తొలి వన్డేలో అరంగ్రేటం చేయనున్నట్టు తెలుస్తున్నది. దక్షిణాఫ్రికా పేస్ దళానికి లుంగి ఎంగిడి నాయకత్వం వహించనున్నాడు.
భారత్ తో వన్డేలకు దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డికాక్, మలన్, టెంబ బవుమా (కెప్టెన్), రస్సి వన్ డర్ డసెన్, డేవిడ్ మిల్లర్, పార్నెల్, అండైల్ పెహుల్క్వాయో, కేశవ్ మహారాజ్, సిసంద మగల, లుంగి ఎంగిడి, షంసి, డ్వేన్ ప్రిటోరియస్, ఎడిన్ మార్క్రమ్, జుమేర్ హమ్జా, కైల్ వెరెన్నె, మార్కో జాన్సేన్