అన్ని ఫార్మాట్లలో అతడే నెంబర్ వన్ అయినప్పుడు ఇంకా సమస్యేంటి..? టెస్టు కెప్టెన్సీపై అజారుద్దీన్ కామెంట్స్

By Srinivas MFirst Published Jan 18, 2022, 6:50 PM IST
Highlights

Mohammad Azharuddin: విరాట్ కోహ్లి వారసుడిగా పరిమిత ఓవర్లలో టీమిండియాను నడిపిస్తున్న  రోహిత్ శర్మకే టెస్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని పలువురు వాదిస్తున్న వేళ అజారుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
 

భారత టెస్టు సారథిగా విరాట్ కోహ్లి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేదెవరనేదానిమీద క్రికెట్ లో జోరుగా  చర్చ నడుస్తున్నది. జాబితాలో నాలుగైదు పేర్లు వినిపిస్తున్నా.. అనుభవం రిత్యా హిట్ మ్యాన్ కే దానిని అప్పగించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై భారత మాజీ క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లు తలో అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. విరాట్ కోహ్లి వారసుడిగా పరిమిత ఓవర్లలో  టీమిండియాను నడిపిస్తున్న  రోహిత్ శర్మకే అప్పగించాలని పలువురు వాదిస్తుంటే.. అతడికి ఫిట్నెస్ సమస్యలున్నాయని,  యువ ఆటగాళ్లు  కెఎల్ రాహుల్ కు గానీ రిషభ్ పంత్ కు గానీ టెస్టు కెప్టెన్సీని అందజేయాలని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ఇదే విషయమై తాజాగా భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ స్పందించాడు. 

టీమిండియా తదుపరి టెస్టు జట్టు సారథిగా రోహిత్ శర్మ పేరును ఖరారు చేయడం ఉత్తమమని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. అన్ని ఫార్మాట్లలో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడని, గత కొన్నేండ్లుగా భారత జట్టు తరఫున  దూకుడైన ఆటతీరును కనబరుస్తూ టీమిండియా విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్న అతడిని  సారథిగా నియమించడమే బెస్ట్ ఛాయిస్ అని చెప్పాడు. 

తనను కలిసిన  పాత్రికేయులతో అజారుద్దీన్  మాట్లాడుతూ.. ‘అన్ని ఫార్మాట్లలో అతడు (రోహిత్ శర్మ) నెంబర్  వన్ ప్లేయర్ అయినప్పుడు ఇంకా అతడిని టెస్టు కెప్టెన్ గా చేయడానికి సమస్యేంటి.. గడిచిన ఐదారేండ్లుగా అతడు బాగా రాణిస్తున్నాడు. అనుభవం లేని ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పితే అనవసర సమస్యలు కొనితెచ్చుకున్నట్టే.. 

రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. అంతేగాక మంచి సారథి. అతడు మరో మూడు నాలుగేండ్లు క్రికెట్ ఆడతాడు. అంతకంటే ఎక్కువ కూడా ఆడొచ్చు.. కానీ అందుకు అతడి శరీరం ఏ విధంగా సహకరిస్తుందో తెలియదు. ఎందుకంటే గాయాలు అతడిని పదే పదే వేధిస్తున్నాయి..’ అని అన్నాడు. 

అంతేగాక.. ‘దూకుడుగా ఆడే లక్షణమున్న రోహిత్ శర్మ లేకపోవడం దక్షిణాఫ్రికా సిరీస్ లో భారత్ ను దారుణంగా దెబ్బతీస్తున్నది. సఫారీలకు ఇది లాభం చేకూరుస్తున్నది. ఓపెనర్ గా బరిలోకి దిగే రోహిత్ శర్మ అటాకింగ్ గేమ్ ఆడటంలో దిట్ట. నాకున్న అనుభవం ప్రకారం.. టెస్టు కెప్టెన్సీకి రోహిత్ అన్ని విధాలా అర్హుడు..’ అని అజారుద్దీన్ తెలిపాడు. 

ఫిట్నెస్ అసలు సమస్య : గవాస్కర్ 

ఇదిలాఉండగా సునీల్ గవాస్కర్ వాదన మరో విధంగా ఉంది. గవాస్కర్ మాట్లాడుతూ.. ‘రోహిత్ తో సమస్య ఏంటంటే ఫిట్నెస్. అన్ని  మ్యాచులకు అందుబాటులో ఉండే ఆటగాడు భారత్ కు కావాలి.  అందుకు అతడు (టీమిండియా కెప్టెన్) ఫిట్ గా ఉండాలి. కెప్టెన్ పదే పదే ఫిట్నెస్ సమస్యల బారిన పడితే జట్టు ప్రతిసారి తాత్కాలిక సారథుల వైపు చూడాల్సి వస్తుంది. ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బందులు పడే ఆటగాళ్ల కంటే చిన్న చిన్న బాహ్య గాయాలున్నా.. ఎప్పుడూ మ్యాచులకు ఫిట్ గా ఉండే ప్లేయర్లను ఎంపిక చేసింది బెటర్...’ అని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి వారసత్వాన్ని టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు అప్పజెప్పాలని  గవాస్కర్ సూచించాడు. 
 

click me!