Ind vs SA ODI: ఆ అవకాశం వస్తే నాకంటే అదృష్టవంతుడు ఎవరూ ఉండరు : టెస్టు కెప్టెన్సీపై తాత్కాలిక సారథి వ్యాఖ్యలు

By Srinivas MFirst Published Jan 18, 2022, 5:38 PM IST
Highlights

KL Rahul Comments On  Test Captaincy: ఇటీవలే దక్షిణాఫ్రికాతో  ముగిసిన టెస్టు సిరీస్ లో భాగంగా అతడికి రెండో టెస్టులో జట్టును నడిపించే అవకాశం వచ్చింది. కానీ ఆ  మ్యాచులో భారత్ ఓడింది. అయినా కూడా.. 

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు రేపట్నుంచి సఫారీలతో ప్రారంభం కాబోయే వన్డే మ్యాచుతో  పరిమిత ఓవర్ల సిరీస్ వేట మొదలుపెట్టనున్నది.  వన్డే సిరీస్ కు ముందు టీమిండియా తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్.. టెస్టు కెప్టెన్సీ, జట్టు వ్యూహాలు, ఇతరత్రా విషయాలపై పాత్రికేయుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకు టెస్టు కెప్టెన్ గా అవకాశమిస్తే తనకంటే అదృష్టవంతుడు మరొకరు ఉండరని అతడు వ్యాఖ్యానించాడు.  ఇటీవలే  ముగిసిన టెస్టు సిరీస్ లో భాగంగా అతడికి రెండో టెస్టులో జట్టును నడిపించే అవకాశం వచ్చింది. కానీ ఆ టెస్టులో భారత్ ఓడింది. టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి వైదొలిగిన నేపథ్యంలో  తర్వాత సారథి పై భారత క్రికెట్ లో జోరుగా చర్చ నడుస్తున్న తరుణంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

రాహుల్ స్పందిస్తూ... ‘దేశానికి నాయకత్వం వహించడమనేది ఎవరికైనా ప్రత్యేకమే.. దానికి నేను భిన్నంగా ఏమీ లేను. నాకు టెస్టు కెప్టెన్సీ అప్పగిస్తే అది చాలా పెద్ద బాధ్యత అవుతుంది. అది చాలా ఉత్తేజకరమైన విషయం. అయితే నేనేం భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు. నా దృష్టంతా రేపట్నుంచి జరుగబోయే  వన్డే సిరీస్ మీదే ఉంది..’ అని అన్నాడు. 

టెస్టు కెప్టెన్సీకి సంబంధించి మీడియాలో పలు రకాల కథనాలు వస్తున్న తరుణంలో రాహుల్  మాట్లాడుతూ.. ‘పేర్లు బయటకు వచ్చేవరకు (బీసీసీఐ ప్రకటన వచ్చే దాకా) మీడియాలో వస్తున్న కథనాల గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు. జోహన్నస్బర్గ్ లో నాకు కెప్టెన్సీ చేపట్టే అవకాశం లభించింది. అది నిజంగా చాలా ప్రత్యేకమైనది. ఆ టెస్టులో మేము విజయం సాధించలేకపోయాం కానీ  నేను మాత్రం ఆ ఓటమి నుంచి చాలా నేర్చుకున్నాను..’ అని తెలిపాడు. 

ఓపెనింగ్ చేస్తా... 

ఈ వన్డే సిరీస్ లో తాను ఓపెనర్ గా బరిలోకి దిగుతానని రాహుల్ చెప్పాడు. రోహిత్ శర్మ  గైర్హాజరీలో తాను.. శిఖర్ ధావన్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నానని  చెప్పాడు. గత 14-15 నెలలలో జట్టు అవసరాలకు తగ్గట్టు పలు స్థానాలలో బ్యాటింగ్ కు దిగిన రాహుల్.. వన్డేలలో తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు. 

అశ్విన్ రీ ఎంట్రీ పై.. 

దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడే అవకాశముందని రాహుల్ హింట్ ఇచ్చాడు. తొలి వన్డే జరిగే బొలాండ్ పార్క్.. స్పిన్నర్లకు అనుకూలిస్తుందని, దీంతో భారత జట్టు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే  అవకాశముందని  చెప్పాడు. ‘ప్రతి వేదిక  భిన్నంగా ఉంటుంది. పార్ల్ పిచ్ టెస్ట్ సిరీస్ లో కంటే వన్డేలలో స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. మా వద్ద నాణ్యమైన స్పిన్నర్లున్నారు. అశ్విన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడు ఎంత మెరుగైన స్పిన్నరో మాకు తెలుసు. చాహల్ కూడా రాణిస్తున్నాడు. ఆ ఇద్దరూ మా జట్టుకు చాలా ముఖ్యం..’ అని అన్నాడు.  

వెంకటేశ్ అయ్యర్ గురించి... 

అయ్యర్ కేకేఆర్ కు ఆడినప్పట్నుంచి  చాలా ఉత్సాహంగా ఉన్నాడు. న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన టీ20  సిరీస్ లో మాతో చేరాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు టీమిండియాకు ఎంతో అవసరం.  వారి కోసం మేము ఎదురుచూస్తున్నాం. వాళ్లు జట్టును బ్యాలెన్స్ చేస్తారు. దక్షిణాఫ్రికాలో రాణించడం అతడికి గొప్ప అవకాశం. 
 

click me!