Jai Shree Ram: ‘జై శ్రీరామ్’ అన్న సౌతాఫ్రికా క్రికెటర్.. టీమిండియా ఫ్యాన్స్ ఖుషి

By Srinivas MFirst Published Jan 25, 2022, 3:13 PM IST
Highlights

Keshav Maharaj writes ‘Jai Shree Raam’: భారత్ తో ముగిసిన వన్డే సిరీస్ లో దక్షిణాఫ్రికా విజయాల్లో కీలక పాత్ర  పోషించిన ఆటగాళ్లలో మహారాజ్ ఒకడు. ఈ సిరీస్ లో అతడు.. భారత మాజీ సారథి విరాట్ కోహ్లిని రెండు సార్లు అవుట్ చేశాడు.
 

టీమిండియాతో ఇటీవలే ముగిసిన టెస్టు, వన్డే సిరీస్ లలో దక్షిణాఫ్రికా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నది. వన్డేలను క్లీన్ స్వీప్ చేసిన సఫారీలు.. టెస్టులను 2-1తో గెలుచుకున్నారు. వన్డేలలో ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర  పోషించిన ఆటగాళ్లలో కేశవ్ మహారాజ్ ఒకడు. ఈ సిరీస్ లో అతడు.. భారత మాజీ సారథి విరాట్ కోహ్లిని రెండు సార్లు అవుట్ చేశాడు. తాజాగా అతడు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు చేస్తూ.. ‘జై శ్రీరామ్’ అని పేర్కొన్నాడు. తన  ప్రొఫైల్ లో కూడా అతడు.. ‘జై శ్రీరామ్, జై హనుమాన్’ అని రాసుకోవడం గమనార్హం. భారత సంతతి క్రికెటర్ అయిన కేశవ్.. సౌతాఫ్రికా తరఫున వన్డేలలో అద్బుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 

తాజాగా భారత్ తో వన్డే సిరీస్ విజయం అనంతరం  ఇన్స్టాగ్రామ్ లో స్సందిస్తూ... ‘అద్భుతమైన సిరీస్ విజయం. ఈ జట్టు (దక్షిణాఫ్రికా) ను చూస్తే గర్వంగా ఉంది. ఇక ఇప్పుడు తర్వాత సిరీస్ కోసం సన్నద్ధం కావాలి..  జై శ్రీరామ్’ అని రాసుకొచ్చాడు. 

 

ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దక్షిణాఫ్రికా తరఫున ఆడుతున్నా మహారాజ్ మాత్రం మూలాలను మరిచిపోలేదని టీమిండియా అభిమానులు  అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కేశవ్ పూర్వీకులు ఉత్తరప్రదేశ్ లోని  సుల్తాన్ పూర్ కు చెందినవాళ్లు. చాలా కాలం క్రితమే వాళ్లు  దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.  పోస్టులో ‘జై శ్రీరామ్’ అని రాయడమే కాదు.. కేశవ్ తన  ప్రొఫైల్ బయో లో కూడా ‘జై శ్రీరామ్, జై హనుమాన్..ఓం’ మంత్రాన్ని రాసుకున్నాడు.  

కాగా భారత్ తో వన్డే సిరీస్ లో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మూడు వికెట్లు తీసుకున్నాడు. 4.59 సగటుతో బౌలింగ్ వేసిన కేశవ్..  ఈ సిరీస్ లోని రెండు, మూడు వన్డేలలో విరాట్ కోహ్లి వికెట్ ను దక్కించుకున్నాడు. రెండో వన్డేలో కోహ్లిని డకౌట్  కూడా చేశాడు.  వన్డేలలో కోహ్లిని డకౌట్ చేసిన తొలి  బౌలర్ కేశవ్ మహారాజే. ఇక మూడో వన్డేలో కోహ్లి దూకుడుగా ఆడుతున్న సమయంలో అతడిని పెవిలియన్ కు పంపాడు.  కోహ్లి నిష్క్రమణతో  టీమిండియా మిడిలార్డర్ వైఫల్యం కొనసాగి భారత్ ఓటమికి దారితీసింది. 

ఇక మహారాజ్ కెరీర్ ను చూస్తే.. 2016లో అతడు దక్షిణాఫ్రికా తరఫున అరంగ్రేటం చేశాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థుడు  కేశవ్.  ఇప్పటిదాకా 39 టెస్టులు ఆడిన  కేశవ్.. 130 వికెట్లు తీసుకున్నాడు. 18 వన్డేలు ఆడి 22 వికెట్లు, 8 టీ20లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు. టెస్టులలో మూడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు.
 

click me!