IPL: రాజస్థాన్ రాయల్స్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన లక్నో.. ఆ రెండేండ్లను గుర్తు చేస్తూ...

By Srinivas MFirst Published Jan 25, 2022, 12:26 PM IST
Highlights

Lucknow franchise’s hilarious dig on RR: తమ ఫ్రాంచైజీ పేరును ‘లక్నో సూపర్ జెయింట్స్’గా నామకరణం చేశారు ఆ జట్టు యమజాని సంజీవ్ గొయెంకా. ఈ పేరును ప్రకటించగానే.. రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ లో ఓ మీమ్ షేర్ చేసింది. దీనికి లక్నో కూడా  గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 
 

వచ్చే ఐపీఎల్ లో  అరంగ్రేటం చేయబోతున్న లక్నో సూపర్ జెయింట్స్.. ఇంకా జట్టుగా పూర్తి స్థాయిలో కుదురుకోకముందే ప్రత్యర్థుల మీద పంచ్ లు, కౌంటర్లకు దిగుతున్నది. తమ జట్టు పేరును ఉద్దేశిస్తూ ట్వీట్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కు దిమ్మతిరిగే  కౌంటర్ ఇచ్చింది. తమను కామెంట్ చేసేప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండని చెప్పకనే చెప్పింది. ఈ ఇరుజట్ల మధ్య జరిగిన  ఫన్నీ ట్విట్టర్ వార్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. 

సోమవారం సాయంత్రం లక్నో ఫ్రాంచైజీ పేరును ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా వెల్లడించిన విషయం తెలిసిందే. తమ కొత్త ఫ్రాంచైజీ పేరును.. ‘లక్నో సూపర్ జెయింట్స్’గా నామకరణం చేస్తూ  ఆయన ప్రకటించారు.  ఇది  సంజీవ్ గొయెంకా గతంలో దక్కించుకున్న పూణె ఫ్రాంచైజీ పేరుకు కలిసేలా ఉండటం గమనార్హం. ‘రైజింగ్ పూణె సూపర్ జెయింట్’   లోని ఊరు పేరును మార్చి లక్నో కు తగిలించారని సోషల్ మీడియాలో  కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. 

 

With all due respect, we missed you those 2 years. 😜 https://t.co/FR0PzZKZA0

— Lucknow Super Giants (@LucknowIPL)

ఇక లక్నో ఈ పేరును ప్రకటించగానే.. రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ వేదికగా ఓ మీమ్ షేర్ చేసింది. బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ నటించిన ఓ చిత్రంలోని డబుల్ రోల్ చేసిన సీన్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. ఒకే సీన్ లో ఇద్దరూ ఉండగా.. ఒకతడికి ‘S’ ను యాడ్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ ఈ మీమ్ ద్వారా.. పరోక్షంగా పూణె పేరునే మళ్లీ ఇక్కడ వాడారని అర్థం వచ్చేలా  ట్వీట్ వేసింది. 

ఈ ట్వీట్ కు లక్నో సూపర్ జెయింట్స్ కూడా తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చింది. ‘మీ మీద అపారమైన గౌరవంతో.. మిమ్మల్ని మేము ఆ రెండేండ్లు మిస్ అయ్యాం... ’ అని కౌంటర్ ఇచ్చింది. యాధృచ్ఛికంగా.. 2016, 2017 ఐపీఎల్ సీజన్ లో  ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కున్న రాజస్థాన్ రాయల్స్  పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ రెండు సీజన్లకు గాను  రాజస్థాన్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా నిషేధం ఎదుర్కుంది. ఆ రెండు సీజన్లలోనే  పూణె, అహ్మదాబాద్ తో కలిసి.. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఇప్పుడు ఇవే రెండు జట్లు ఫన్నీ ట్విట్టర్ వార్ కు దిగడం గమనార్హం. 
 
కగిసొ రబాడా  కీలక ఆటగాడు : రాహుల్ 

లక్నో జట్టు సారథి కన్ను సౌతాఫ్రికా  పేసర్ కగిసొ రబాడా మీద పడిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.  తాజాగా రాహుల్ స్పందిస్తూ. ‘ఢిల్లీ క్యాపిటల్స్ కు రాహుల్ కీలక ఆటగాడు. ఆ జట్టు విజయంలో అతడిదే కీలక పాత్ర. ప్రతి జట్టు అతడిలాంటి ఒక ఆటగాడు ఉండాలని కోరుకుంటుంది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేయగల సమర్థుడు రబాడా..’అని  అన్నాడు.  

ఐపీఎల్ లో  ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రబాడా ను ఈ సారి ఆ ఫ్రాంచైజీ రిటైన్  చేసుకోలేదు.  కానీ వేలంలో రబాడాను  దక్కించుకునేందుకు భావిస్తున్నది.  అయితే రబాడాను తమ జట్టులోకి తీసుకునేందుకు రాహుల్ పావులు కదుపుతున్నాడు. ఈ నేపథ్యంలో  ఈసారి వేలంలో రబాడాను దక్కించుకునేందుకు ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయనే విషయం స్పష్టమవుతున్నది. 
 

click me!