WPL 2024: ఐదు వికెట్లు పడగొట్టి.. యూపీ వారియర్స్ పతనాన్ని శాసించింది.. ఇంతకీ శోభన ఆశ ఎవరు?

By Rajesh Karampoori  |  First Published Feb 25, 2024, 8:39 AM IST

Sobhana Asha:  ఉమెన్స్  ప్రీమియర్ లీగ్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి భారతీయురాలు ఆశా శోభన రికార్డు క్రియేట్ చేసింది.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , యూపీ వారియర్స్ మధ్య జరిగిన WPL 2024 మ్యాచ్‌లో శోభన ఐదు వికెట్లు తీసి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇందులో ఒక ఓవర్‌లో మూడు వికెట్లు తీయడం గమనార్హం. ఇంతకీ శోభన ఆశ ఎవరు?


Sobhana Asha: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగా బోణీ కొట్టింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన యూపీపై ఆర్సీబీ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవడంలో స్పిన్నర్ శోభనా ఆశ కీలకంగా వ్యవహరించింది. తన బౌలింగ్ లో ప్రత్యార్థి యూపీ వారియర్స్ కు చుక్కలు చూపించింది. ఈ మ్యాచ్‌లో శోభన నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది.

ఆరంభంలో వృందా దినేష్ , తహ్లియా మెక్‌గ్రాత్‌ల వంటి ముఖ్యమైన వికెట్లు తీసిన ఆమె ఆ తర్వాత తన చివరి ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టి.. యూపీ పై ఆర్సీబీ విజయ బావుటా ఎగరేసేలా చేసింది.  ఇలా ఒక్కే మ్యాచ్ లో ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకుని.. డబ్ల్యూపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది శోభన ఆశ. ఇలా తన అద్బుత ప్రదర్శనతో  శోభనా ఆశ ఒక్కసారిగా మహిళల క్రికెట్‌లో సంచలనంగా మారింది. దీంతో ఇంతకీ శోభన ఆశ ఎవరు? ఆమె బ్యాగ్ గ్రాఫ్ ఏంటీ? అని నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.
 
శోభన ఆశా  ఎవరు?

Latest Videos

శోభన ఆశా .. డబ్ల్యుపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతోంది. ఈ లెగ్ స్పిన్నర్,  మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కేరళ రాజధాని త్రివేండ్రంలో 1991లో జన్మించాడు. ఆశా తన తండ్రి డ్రైవరు కావడంతో జీవితాంతం పేదరికంతో పోరాడింది.  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్ఫూర్తితో ఆశా శోభన తన 13 ఏళ్ల వయసులో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె సీనియర్ జట్టుకు ఆడింది. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌,  రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్ ఆమె అభిమాన ఆటగాళ్లు.. డబ్యూ పీఎల్ లో ఆడకముందు ఆమె దేశీయ క్రికెట్‌లో కేరళ, పుదుచ్చేరి, రైల్వేస్ జట్ల‌కు ప్రాతినిధ్యం వహించింది. 

డబ్యూపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో శోభనా ఆశాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 10 లక్షలకు ఎంచుకుంది. శోభన రూపంలో ఆర్‌సీబీకి గొప్ప బౌలింగ్ ఆల్‌రౌండర్ దొరికిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  గతేడాది ఆర్‌సీబీ తరఫున ఆడి 5 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీసింది. వాస్తవానికి ఆమెకు చాలా మ్యాచుల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ, రెండో సీజన్‌లో ఆమె అందివచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంది. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టింది. అందరి ద్రుష్టిని తన వైపుకు తిప్పుకుంది. మిగతా మ్యాచ్‌ల్లోనూ శోభన ఆశ ఇలానే అద్భుతంగా రాణించాలనీ, జాతీయ జట్టుకు ఆమెను ఎంపిక కావాలని ఫ్యాన్ కోరుకుంటున్నారు.

click me!