Team India: మార్గదర్శకాలను పాటించడం విషయంలో భారత క్రికెట్ నియంత్ర మండలి (బీసీసీఐ) కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పలువురు స్టార్ క్రికెటర్లకు బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్దమైంది. దేశవాళీ పోటీల కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇవ్వవద్దని ఇప్పటికే బీసీసీఐ క్రికెటర్లను హెచ్చరించింది.
BCCI - Shreyas Iyer - Ishan Kishan: క్రికెట్ లీగ్ మ్యాచ్ లు, టోర్నమెంట్లకు ప్రధాన్యత ఇస్తూ దేశవాళీ క్రికెట్ ను పట్టించుకోకుండా ఉంటున్న క్రికెటర్ల విషయంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ మెయిల్స్ సైతం పంపిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. తమ హెచ్చరికలను లెక్కచేయకుండా తిరుగుతున్న స్టార్ ప్లేయర్ల కాంట్రాక్ట్ లను సైతం రద్దు చేయడానికి సిద్ధమవుతున్నదని సమాచారం. దేశవాళీ క్రికెట్ టోర్నీలు (రంజీ, సీకే నాయుడు ట్రోఫీ సహా ఇతర టోర్నీలు) ఆడాలని సూచించినా ఇప్పటికీ ఆడకపోవడంతో బీసీసీఐ ఇద్దరు స్టార్ ప్లేయర్లకు షాక్ ఇవ్వనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
దీనిలో భాగంగా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను తొలగించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల్లో టాక్ నడుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం, రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు దూరమైనందుకు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ల విషయంలో బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. "అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు, 2023-24 సీజన్‌కు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను దాదాపు ఖరారు చేశారు. దీనిని త్వరలోనే బీసీసీఐ ప్రకటిస్తుంది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌లు ఆ జాబితా నుండి మినహాయించబడే అవకాశం ఉంది. బీసీసీఐ ఆదేశించినప్పటికీ దేశవాళీ క్రికెట్ పై వారు ఆసక్తిచూపడం లేదని" అని ఒక మూలాన్ని ఉటంకిస్తూ పేర్కొంది.
ఆటగాళ్లకు డైరెక్టుగా జైషా వార్నింగ్..
రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ పోటీల కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి ప్రాధాన్యత ఇవ్వకూడదని కేంద్ర కాంట్రాక్టు పొందిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ సెక్రటరీ జే షా సూటీగా హెచ్చరికలు చేశాడు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు పొందిన ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్ వంటి ప్రముఖ ఆటగాళ్ళు ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో పాల్గొనడంలో సంకోచం ప్రదర్శించారు. ఇది వారి కెరీర్‌కు తీవ్రమైన చిక్కులు కలిగించే అవకాశముంది.
ఇషాన్ కిషన్ తీరుపై ఆగ్రహం..
ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ తరఫున ఆడాడు. అయితే, మానసిక ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే వైదొలిగాడు. భారత ప్రధాన కోచ్, రాహుల్ ద్రవిడ్ జాతీయ జట్టులోకి ఇషాన్ కిషన్ తిరిగి రావడానికి దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లను ఆడాలని సూచించారు. అయితే, ఇషాన్ కిషన్ మాత్రం జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి బరోడాలో రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం సిద్ధమవుతున్నట్లు కనిపించాడు.
శ్రేయాస్ అయ్యార్ సైతం..
రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు దూరంగా ఉండటం వెనుక ఫిట్‌నెస్ సమస్య ఉందని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా ఉన్న అయ్యర్.. అస్సాంతో జరిగిన ముంబై చివరి లీగ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌కు గైర్హాజరయ్యాడు. అయ్యర్ తన అందుబాటులో లేకపోవడానికి వెన్ను గాయం కారణంగా పేర్కొనగా, నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ హెడ్ నితిన్ పటేల్ నుండి ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్లకు చేసిన కమ్యూనికేషన్ ఈ వాదనకు విరుద్ధంగా ఉండటంతో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.