RCB vs UPW WPL 2024 Highlights: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ మధ్య జరిగింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో యూపీపై ఆర్సీబీ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.
RCB vs UPW WPL 2024 Highlights: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనంగా బోణీ కొట్టింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో యూపీపై ఆర్సీబీ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులు చేసింది.
ఇందులో రిచా ఘోష్ 37 బంతుల్లో 62 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడింది. అలాగే.. తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన 44 బంతుల్లో 53 పరుగులు చేసిన అర్ధశతకంతో తన సత్తాచాటింది. చివరి బంతికి శ్రేయాంక పాటిల్ సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించింది. యూపీ తరఫున రాజేశ్వరి గైక్వాడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. గ్రేస్ హారిస్, తహ్లియా మెక్‌గ్రాత్, ఎక్లెస్టోన్, దీప్తి శర్మలకు ఒక్కో వికెట్ దక్కింది.
అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లో 5 పరుగులు చేసి అలిస్సా హీలీ ఔటైంది. ఈ క్రమంలో వింద్రా, తహ్లియా ఇన్నింగ్స్‌ను నియంత్రించడానికి ప్రయత్నించారు. అయితే శోభన ఒకే ఓవర్‌లో ఇద్దరినీ అవుట్ చేయడంతో యుపి టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీని తర్వాత వచ్చిన శ్వేత,గ్రేస్ హారిస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు వీరిద్దరూ యూపీని విజయపథంలోకి చేర్చారు. ఈ తరుణంలో స్మృతి మంధాన మరోసారి శోభనకు బంతిని అందించింది. అందివచ్చిన ఈ అవకాశాన్ని ఏ మాత్రం విడిచిపెట్టకుండా తన బౌలింగ్ తో సునామీని స్రుష్టించింది.
ఇలా 17 ఓవర్ వేసిన శోభన .. వరుసగా.. శ్వేత, గ్రేస్, కిరణ్‌లను ఔట్ చేసి ఫెవిలియన్ కు పంపింది. ఈ ఓవర్ లో మ్యాచ్ మొత్తం ములుపు తిరిగింది. చివరి ఓవర్‌లో విజయానికి 11 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, యూపీ రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. యూపీ తరఫున గ్రేస్ హారిస్ అత్యధికంగా 38 పరుగులు చేశారు. శ్వేత 31 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. తహ్లియా 22 పరుగులు చేసింది. ఆర్సీబీ తరఫున శోభన ఐదు వికెట్లు పడగొట్టింది. జార్జియా వేర్‌హామ్, సోఫీలకు ఒక్కో వికెట్ దక్కింది.