మూడో వన్డేలోనూ మనదే విజయం! సిరీస్ క్లీన్‌స్వీప్... సికందర్ రజా వీరోచిత పోరాటం...

By Chinthakindhi RamuFirst Published Aug 22, 2022, 8:54 PM IST
Highlights

సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన సికందర్ రజా... 8వ వికెట్‌కి ఎవెన్స్‌తో కలిసి శతాధిక భాగస్వామ్యం... 13 పరుగుల తేడాతో ఓడిన జింబాబ్వే...

290 పరుగుల లక్ష్యఛేదనలో పసికూన జింబాబ్వే దాదాపు టీమిండియాకి హార్ట్ ఎటాక్ తెప్పించింది. సికందర్ రజా సెంచరీతో చెలరేగడంతో ఆఖరి ఓవర్‌ వరకూ సాగిన మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. టీమిండియా ఖాతాలో మరో సిరీస్ చేరింది. జింబాబ్వే పర్యటనలో భారత జట్టు వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్ చేసింది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను డ్రా చేసుకున్న భారత జట్టు... ఆ తర్వాత వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ టూర్లలో సిరీస్‌లు గెలిచి, పసికూన జింబాబ్వేపైనా సేమ్ సీన్ రిపీట్ చేసింది. 290 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన జింబాబ్వేకి మూడో ఓవర్‌లోనే షాక్ ఇచ్చాడు దీపక్ చాహార్...

9 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన ఇన్నోసెంట్ కియా, దీపక్ చాహార్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సేన్ విలియమ్స్, కైటనో కలిసి రెండో వికెట్‌కి 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 46 బంతుల్లో 7 ఫోర్లతో 45 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న సేన్ విలియమ్స్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

31 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన టోనీ మున్యోంగని ఆవేశ్ ఖాన్ అవుట్ చేయగా 22 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన కైటానోను కుల్దీప్ యాదవ్ స్టంపౌట్ చేశాడు. 16 పరుగులు చేసిన జింబాబ్వే కెప్టెన్ రెగిస్ చక్‌బవా, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా రియాన్ బర్ల్ 8 పరుగులు చేశాడు. లుక్ జాంగ్వే 14 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

169 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే, 200 కూడా దాటదని అనిపించింది. అయితే సికందర్ రజా, బ్రాడ్ ఎవెన్స్‌తో కలిసి వీరోచిత పోరాటం చేశాడు. 87 బంతుల్లో సెంచరీ అందుకున్న సికందర్ రజా... మ్యాచ్‌కి ఉత్కంఠభరితంగా మార్చేశాడు. గత ఆరు వన్డేల్లో సికందర్ రజాకి ఇది మూడో సెంచరీ.
 
3 ఓవర్లలో 33 పరుగులు కావాల్సిన దశలో ఆవేశ్ ఖాన్ వేసిన 48వ ఓవర్‌లో ఓ సిక్సర్, ఫోర్‌తో 16 పరుగులు రాబట్టాడు సికందర్ రజా. అయితే ఆఖరి బంతికి ఎవెన్స్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన ఆవేశ్ ఖాన్, ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. 76 బంతుల్లో 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బ్రాడ్ ఎవెన్స్ 37 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 95 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు చేసిన సికందర్ రజా... శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

49వ ఓవర్‌లో సికందర్‌ని అవుట్ చేసిన శార్దూల్ ఠాకూర్ 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో జింబాబ్వే విజయానికి 15 పరుగులు కావాల్సి వచ్చాయి. నయూచిని డకౌట్ చేసిన ఆవేశ్ ఖాన్, జింబాబ్వే ఇన్నింగ్స్‌కి 276 పరుగుల వద్ద తెరదింపాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది...

click me!