జింబాబ్వేతో మూడో వన్డే... శుబ్‌మన్ గిల్ సెంచరీ! భారీ స్కోరు చేసిన టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Aug 22, 2022, 4:16 PM IST
Highlights

IND vs ZIM 3rd ODI: వన్డేల్లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేసిన శుబ్‌మన్ గిల్... ఇషాన్ కిషన్‌తో కలిసి భారీ భాగస్వామ్యం...

భారత యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్... వన్డేల్లో వచ్చిన అవకాశాలను చక్కగా వాడుకుంటున్నాడు. కెఎల్ రాహుల్ గాయపడడంతో వెస్టిండీస్ సిరీస్‌లలో ఆకట్టుకున్న శుబ్‌మన్ గిల్..  జింబాబ్వేతో వన్డే సిరీస్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు..  శుబ్‌మన్ గిల్ సెన్సేషనల్ సెంచరీ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 289 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది...

వరుసగా మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కెఎల్ రాహుల్, తొలి రెండు మ్యాచుల్లా కాకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలో ఓపెనర్లు ఇద్దరూ వికెట్ కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో స్కోరు బోర్డు నెమ్మదిగా కదిలింది...

15 ఓవర్లలో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది భారత జట్టు. 46 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, బ్రాడ్ ఎవెన్స్ బౌలింగ్స్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం జింబాబ్వే టూర్‌కి వచ్చిన కెఎల్ రాహుల్... తొలి వన్డేలో బ్యాటింగ్‌కే రాలేదు. రెండో వన్డేలో 5 బంతులాడి 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు...

68 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేసిన శిఖర్ ధావన్ కూడా బ్రాడ్ ఎవెన్స్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 84 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా.  ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ కలిసి మూడో వికెట్‌కి 140 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...

61 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీపక్ హుడా 1 పరుగుకే బ్రాడ్ ఎవెన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా జాంగ్వే బౌలింగ్‌లో వరుసగా 2 సిక్సర్లు బాదిన సంజూ శాంసన్, 13 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...


83 బంతుల్లో వన్డేల్లో మొట్టమొదటి సెంచరీ పూర్తి చేసుకున్న శుబ్‌మన్ గిల్, జింబాబ్వే గడ్డపై అతి పిన్న వయసులో సెంచరీ నమోదు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే వన్డేల్లో విదేశాల్లో సెంచరీ చేసిన మూడో చిన్న వయస్కుడు శుబ్‌మన్ గిల్...

ఇంతకుముందు యువరాజ్ సింగ్ 22 ఏళ్ల 41 రోజుల వయసులో ఆస్ట్రేలియాపై సెంచరీ చేస్తే, 22 ఏళ్ల 315 రోజుల వయసులో విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్‌లో సెంచరీ చేశాడు. శుబ్‌మన్ గిల్ ప్రస్తుత వయసు 23 ఏళ్ల 28 రోజులు.. 

అక్షర్ పటేల్ 4 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ కాగా 97 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 130 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో బ్రాడ్ ఎవెన్స్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు... జింబాబ్వేలో భారత బ్యాటర్‌కి ఇదే అత్యధిక స్కోరు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ చేసిన 127 పరుగుల రికార్డును అధిగమించాడు శుబ్‌మన్ గిల్. గిల్ అవుటైన తర్వాతి బంతికి ఫోర్ బాదిన శార్దూల్ ఠాకూర్, మూడో బంతికి అవుట్ అయ్యాడు...

జింబాబ్వే బౌలర్ బ్రాడ్ ఎవెన్స్ 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 

click me!