WI vs IND: హోప్ హోరు.. పూరన్ పంతం.. ఇండియా ముందు భారీ లక్ష్యం నిలిపిన విండీస్..

Published : Jul 24, 2022, 10:59 PM IST
WI vs IND: హోప్ హోరు.. పూరన్ పంతం.. ఇండియా ముందు భారీ లక్ష్యం నిలిపిన విండీస్..

సారాంశం

WI vs IND ODI: భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసింది. ఓపెనర్ షాయి హోప్ సెంచరీ బాదాడు.  నికోలస్ పూరన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.   

సిరీస్ లో ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. అంతగా అనుభవం లేని భారత పేసర్లను ధాటిగా ఎదుర్కుంది. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఓపికగా ఆడిన విండీస్..  భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిలపింది. ఓపెనర్ షాయి హోప్ (135 బంతుల్లో 115, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కగా.. నికోలస్ పూరన్ (77 బంతుల్లో  74, 1 ఫోర్, 6 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరికి తోడు టాపార్డర్ బ్యాటర్లు కూడా రాణించడంతో విండీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.  మరి భారత జట్టు ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించగలదా..?  అనేది కొద్దిసేపట్లోనే తేలనుంది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. హోప్ తో పాటు మేయర్స్ (23 బంతుల్లో 39, 6 ఫోర్లు, 1 సిక్సర్) లు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్ తో ఖాతా తెరిచాడు హోప్. తొలి వన్డే ఆడుతున్న అవేశ్ ఖాన్  వేసిన  రెండో ఓవర్లో తొలి బంతిని బౌండరీ బాదగా.. చివరి రెండు బంతులను మేయర్స్ బౌండరీకి తరలించాడు.

ఆ తర్వాత ఓవర్లో కూడా అవేశ్ ను ఈ ఇద్దరూ వదిలిపెట్టలేదు. ఈ ఓవర్లో కూడా మూడు ఫోర్లు బాదారు. దీంతో విండీస్ స్కోరు ధాటిగా ముందుకు కదిలింది.  ఇక శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో  మేయర్స్.. 4,6 బాదాడు. దూకుడుగా ఆడుతున్న మేయర్స్ ను దీపక్ హుడా.. తాను వేసిన తొలి బంతికే ఔట్ చేశాడు. దీంతో 65 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

వన్ డౌన్ లో వచ్చిన బ్రూక్స్ కూడా ధాటిగానే ఆడాడు.   వీలుచిక్కినప్పుడల్లా బ్రూక్స్-హోప్ లు బంతిని బౌండరీకి తరలించారు. చాహల్ వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్లో ఐదో బంతిని  సిక్సర్ గా తరలించిన హోప్  హాఫ్ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు. 

రెండో వికెట్ కు 65 పరుగులు జోడించిన క్రమంలో ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని అక్షర్  పటేల్ విడదీశాడు. అతడు వేసిన ఇన్నింగ్స్ 21.3 ఓవర్లో  బ్రూక్స్.. ధావన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే క్రమంలో విండీస్ కు భారత్ మరో షాకిచ్చింది.  మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన బ్రాండన్ కింగ్ (0) ను చాహల్ పెవిలియన్ కు పంపాడు.  దీంతో విండీస్ 130 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.  

పూరన్-హోప్ శతక భాగస్వామ్యం.. 

ఈ క్రమంలో  హోప్ తో కలిసిన కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో 74, 1 ఫోర్, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత నెమ్మదిగా ఆడిన పూరన్.. తర్వాత జూలు విదిల్చాడు. మిడిల్ ఓవర్స్ లో ఈ ఇద్దరూ సింగిల్స్ కే ప్రాధాన్యమిచ్చారు. కానీ చాహల్ వేసిన ఇన్నింగ్స్ 38వ ఓవర్లో రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకన్నాడు. అర్థ శతకం తర్వాత పూరన్ మరింత రెచ్చిపోయాడు. అక్షర్ పటేల్ వేసిన 40వ ఓవర్లో సిక్సర్ బాది స్కోరు బోర్డుకు ఊపుతెచ్చాడు.ఈ క్రమంలో ఈ ఇద్దరూ వంద పరుగుల భాగస్వామ్యం  దాటారు.  స్కోరును పెంచే క్రమంలో పూరన్.. శార్దూల్ ఠాకూర్ వేసిన 43.4 ఓవర్లో  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 117 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

పూరన్ నిష్క్రమించిన  తర్వాత చాహల్ వేసిన ఇన్నింగ్స్ 44.4 ఓవర్లో సిక్సర్ కొట్టిన హోప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 125 బంతుల్లో శతకం బాదిన హోప్ కు ఇది వన్డేలలో 13వ సెంచరీ కావడం గమనార్హం. అంతేగాక వన్డేలలో అతడికి ఇది వందో గేమ్. 

చివర్లో రోవ్మన్ పాలెవ్ (13) ధాటిగా ఆడే క్రమంలో త్వరగానే నిష్క్రమించినా.. రొమారియా షెపర్డ్ (15 నాటౌట్) విండీస్ స్కోరును 300 దాటించాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. దీప్ హుడా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ లు తలో వికెట్ పడగొట్టారు. తొలి వన్డే ఆడుతున్న అవేశ్ ఖాన్ (6 ఓవర్లలో వికెట్లేమీ లేకుండా 54 పరుగులు) భారీగా పరుగులిచ్చుకున్నాడు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?