
ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికాల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఫలితం తేలకుండానే ముగిసింది. హెడింగ్లీ వేదికగా జరిగిన మూడో వన్డేలో వరుణుడు అడ్డుకోవడంతో మ్యాచ్ అర్థాంతరంగా రద్దైంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొదలైన వాన.. ఎంతకూ వదలకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఈ సిరీస్ ఫలితం తేలకుండానే ముగిసింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ సఫారీలు నెగ్గగా రెండో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది.
కీలక మ్యాచ్ లో టాస్ నెగ్గిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టు ఓపెనర్ జానేమన్ మలన్ (11) త్వరగానే నిష్క్రమించినా మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (76 బంతుల్లో 92 నాటౌట్, 13 ఫోర్లు) ధాటిగా ఆడాడు. వన్ డౌన్ లో వచ్చిన రస్సీ వాన్ డర్ డసెన్ (26)తో కలిసి రెండో వికెట్ కు 75 పరుగులు జోడించాడు.
డసెన్ ను అదిల్ రషీద్ బౌల్డ్ చేసినా తిరిగి మార్క్రమ్ (24 నాటౌట్) తో కలిసి ధాటిగా ఆడాడు డికాక్. ఇంగ్లాండ్ ప్రధాన బౌలర్లతో పాటు స్పిన్ ద్వయం మోయిన్ అలీ, అదిల్ రషీద్ లను సమర్థంగా ఎదుర్కున్నాడు. రషీద్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో రెండో బంతులను బౌండరీలుగా మలచిన డికాక్.. 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా అతడు అదే జోరు కొనసాగించాడు.
అయితే మోయిన్ అలీ 27.4 ఓవర్లో బౌలింగ్ చేస్తుండగా వర్షం ప్రారంభమైంది. అప్పటికీ సౌతాఫ్రికా.. 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. గంటసేపు దాటినా వరుణుడు శాంతించలేదు. మరో గంట సేపు వేచి చూసిన అంపైర్లు ఇక ఆటసాగదని తేల్చేశారు. దీంతో ఇరు జట్ల అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.
ఇండియాతో వరుసగా టీ20తో పాటు వన్డే సిరీస్ కూడా కోల్పోయిన ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా సిరీస్ లో కూడా గొప్పగా ఆడలేదు. ఇయాన్ మోర్గాన్ తర్వాత సారథ్య బాధ్యతలు చేపట్టిన జోస్ బట్లర్ జట్టును ముందుండి నడిపించడంలో విఫలమవుతున్నాడన్న విమర్శలు ఎదుర్కుంటున్నాడు. ఈ మ్యాచ్ లో నెగ్గి విమర్శలకు చెక్ పెట్టాలని అతడు భావించినా వరుణుడు బట్లర్ ఆశలమీద నీళ్లు చల్లాడు.
వన్డే సిరీస్ ముగిసిన నేపథ్యంలో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య బుధవారం నుంచి మూడు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానున్నది. 27, 28, 31 తేదీలలో మ్యాచులు జరుగుతాయి. మరి టీ20లలో అయినా ఫలితం తేలుతుందో..? లేదో అని ఇరు జట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదీగాక ఇరుజట్లలో హిట్టర్లు, ఆల్ రౌండర్లు పుష్కలంగా ఉండటంతో ఈ మ్యాచులు అభిమానులకు మరింత మజాను పంచనున్నాయి.