
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు అది ముగిశాక వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై చివరి మాసంలో అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు సీనియర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రిషభ్ పంత్ లకు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. ఈ సిరీస్ లో భారత జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు.
రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ధావన్ కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పగా రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్ గా నియమించారు. ఇక ఐర్లాండ్ సిరీస్ లో ఆడిన పలువురు ఆటగాళ్లనే వెస్టిండీస్ తో వన్డే జట్టులో కూడా కొనసాగించారు.
రిషభ్ పంత్ కు విశ్రాంతినివ్వడంతో సంజూ శాంసన్ వికెట్ కీపర్ గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్ ను కూడా వన్డే జట్టులోకి తీసుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా లు కూడా వన్డే జట్టులోకి వచ్చారు. మిడిలార్డర్ బాధ్యతలు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ మోయనున్నారు. స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ లను ఎంపికచేయగా.. అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ లు పేసర్లుగా ఉండనున్నారు. ఉమ్రాన్ మాలిక్ తో పాటు ఐర్లాండ్ సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యాకు విండీస్ తో వన్డే సిరీస్ లో చోటు దక్కలేదు.
వెస్టిండీస్ తో మూడు వన్డేలకు భారత జట్టు : శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్
విండీస్ తో వన్డే సిరీస్ షెడ్యూల్ ఇది :
- జులై 22 : తొలి వన్డే
- జులై 24 : రెండో వన్డే
- జులై 27 : మూడో వన్డే (ఈ మూడు వన్డేలు ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ లోనే జరుగుతాయి) ఈ సిరీస్ ముగిశాక టీమిండియా.. విండీస్ తో 5 టీ20లు కూడా ఆడుతుంది. జులై 22 నుంచి ఆగస్టు 2వరకు విండీస్ పర్యటన ఉండనుంది.