
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య మంగళవారం ముగిసిన ఎడ్జబాస్టన్ టెస్టులో తొలి రోజు ఆట తర్వాత రిషభ్ పంత్ సెంచరీ గురించి ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి పాల్ కాలింగ్ వుడ్ మాట్లాడుతూ.. ‘పంత్ ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే అదొక బ్యాజ్‌బాల్. 111 బంతుల్లో 146 పరుగులు.. అదీ టెస్టు క్రికెట్ లో.. 98 కే 5 వికెట్లు కోల్పోయిన దశలో అతడు అద్భుతంగా ఆడాడు..’ అని అన్నాడు. ఇక ఇంగ్లాండ్ అభిమానులు సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ఆ జట్టు ఆటతీరును బ్యాజ్‌బాల్ గా కొనియాడుతున్నారు. అసలేంటి బ్యాజ్‌బాల్..? దీని కథేంది..?
బ్యాజ్‌బాల్ గురించి తెలుసుకోవడానికంటే ముందు ఒకసారి 1992 వన్డే ప్రపంచకప్ కు వెళ్దాం. ఆ టోర్నీ లో న్యూజిలాండ్ కు చెందిన మార్టిన్ క్రో.. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆటతీరునే మార్చేశాడు. తొలి 15 ఓవర్లలో వీరవిహారం చేసి అటాకింగ్ కు దిగి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. ఆ టోర్నీలో కివీస్ ను సెమీస్ కు చేర్చాడు.
బ్రెండన్ కొనసాగిస్తూ..
ఇక 2015కు వద్దాం. ఈసారి జరిగిన వన్డే ప్రపంచకప్ లో కూడా న్యూజిలాండ్ 1992 ప్రపంచకప్ ఆటతీరునే ప్రదర్శించింది. ఈ టోర్నీలో కివీస్ సారథి బ్రెండన్ మెక్ కల్లమ్.. శివతాండవం చేశాడు. వన్డేలను కూడా టీ20 ల మాదిరి మార్చి బాదుడే మంత్రంగా చెలరేగాడు. ఇక్కడ కూడా బ్రెండన్ పాటించింది అటాకింగ్ గేమ్ మంత్రమే. తొలి ఓవర్ నుంచే ప్రత్యర్థి మీదకు దాడికి దిగడం.. వాళ్లను మానసికంగా దెబ్బతీయడం.. ఈ సూత్రం ప్రధాన ఉద్దేశమిదే. బ్రెండన్ ఈ సూత్రాన్ని టోర్నీ ఆసాంతం తూచా తప్పకుండా పాటించాడు. ఫైనల్ లో ఆసీస్ చేతిలో ఓటమి తప్పితే ఆ జట్టు టోర్నీమొత్తం రాణించింది.
ఇంగ్లాండ్ కు పాకింది..
ఇటీవలే ఇంగ్లాండ్ జట్టు.. న్యూజిలాండ్ సిరీస్ కు ముందు యాషెస్ లో ఆసీస్ తో పాటు వెస్టిండీస్ చేతిలో ఓడి దారుణ పరాజయాలు మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టులో ప్రక్షాళన ప్రారంభమైంది. కొత్త కెప్టెన్ గా బెన్ స్టోక్స్, కొత్త హెడ్ కోచ్ గా నాటి న్యూజిలాండ్ సారథి బ్రెండన్ మెక్ కల్లమ్ వచ్చాడు. ఈ ఇద్దరూ కలిశాక ఇంగ్లాండ్ వరుసగా నాలుగు టెస్టులలో గెలిచింది. ఈ నాలుగు టెస్టులలో ఇంగ్లాండ్ అనుసరించిన మంత్రం బ్యాజ్‌బాల్. అదేనండి అటాకింగ్ గేమ్. మనభాషలో చెప్పాలంటే దూకుడే మంత్రంగా చెలరేగడం..
ఈ పేరెందుకిలా..?
బ్యాజ్‌బాల్ అనడానికి వినడానికి విచిత్రంగా ఉంది కదా. ఈ పేరుకు బ్రెండన్ కు అవినాభావ సంబంధం ఉంది. మెక్ కల్లమ్ నిక్ నేమ్ బ్యాజ్. అతడి ఆటతీరు దూకుడుగా ఆడటమే. అతడి ఆటతీరుకు బాల్ ను జోడిస్తూ పెట్టిన కొత్త పేరే బ్యాజ్‌బాల్.
ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే..
సంప్రదాయక టెస్టు క్రికెట్ అంటే చెవికోసుకునే ఇంగ్లాండ్ లో ఇటీవల కాలంలో టీ20ల రాకతో దానిమీద ఆసక్తి తగ్గిపోతున్నది. అయితే టెస్టు క్రికెట్ కు ఉన్న క్రేజ్, దాని ఘనతను తగ్గించకుండా.. అస్థిత్వాన్ని కాపాడటానికి నడుం కట్టింది బ్రెండన్ అండ్ కో. ఇంట్లో కూర్చున్న ప్రేక్షకులను గ్రౌండ్ కు రప్పించడానికి గాను బ్యాజ్‌బాల్ ను ఉపయోగిస్తున్నది. టెస్టు క్రికెట్ లో కూడా మెరుపు బ్యాటింగ్, అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసాలు, బౌలర్ల దూకుడు, అటాకింగ్ ఫీల్డింగ్ ను పెట్టి ప్రేక్షకులకు అసలైన క్రికెట్ వినోదాన్ని పంచుతున్నది. బ్రెండన్-స్టోక్స్ వచ్చాక ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టైల్ కూడా మారింది. బెయిర్ స్టో, జో రూట్, ఓలీ పోప్, బెన్ స్టోక్స్ లు ఈ అప్రోచ్ ను ఒంటబట్టించుకున్నారు.
ఫలితాలు కళ్లముందున్నాయి..
టెస్టు క్రికెట్ లో అటాకింగ్ సాధ్యమా..? 300 కు పైగా పరుగులు ఛేదించాల్సి ఉండి రోజున్నర ఆట ఉంటే ఏ జట్టైనా నింపాదిగా ఆడుతుంది. ఈ క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోతే మాత్రం ఇక డిఫెన్సే గతి. అంతేగానీ ఆ మ్యాచ్ ను గెలవడానికి కనీస ప్రయత్నాలు కూడా ఉండవు. కానీ ఇంగ్లాండ్ గెలిచిన గత నాలుగు మ్యాచులలో అన్నీ ఛేజింగ్ లే. న్యూజిలాండ్ తో సిరీస్ లో 277, 299, 296 పరుగులను సక్సెస్ఫుల్ గా ఛేదించింది. ఇక తన క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగల లక్ష్యాన్ని (378) కూడా నిన్న అలవోకగా అందుకుంది. ముఖ్యంగా నాలుగో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆడుతున్న తీరు క్రికెట్ పండితులను కూడా విస్మయానికి గురి చేస్తున్నది. ఇదే జోరు కొనసాగితే ఇంగ్లాండ్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలుకొట్టడం పెద్ద పనేం కాదు. ఈ బ్యాజ్‌బాల్ మంత్రం ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ ను ముంచుతుందో.. తేల్చుతుందో మరికొన్ని రోజులు ఆగితేగానీ చెప్పలేం.
నష్టాలూ అంతే..
అయితే ఈ విధానాన్ని ప్రశంసించేవాళ్లు ఎంతమంది ఉన్నా విమర్శించేవాళ్లు కూడా ఉన్నారు. బ్యాజ్‌బాల్ విధానం వల్ల టెస్ట్ క్రికెట్ కు నష్టమే తప్ప లాభం చాలా తక్కువని పలువురు క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఐదు రోజుల మ్యాచులు 3, 4 రోజుల్లో ముగుస్తుండగా అది రాను రాను మరింత కుచించుకుపోయే ప్రమాదముంది.
మనకు కొత్తేం కాదు..
బ్యాజ్‌బాల్ అప్రోచ్ ట్విటర్ లో ట్రెండింగ్ లో ఉన్నప్పట్నుంచి దీనిమీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే టీమిండియా ఫ్యాన్స్ మాత్రం మీకిది కొత్తేమో గానీ మా నజఫ్గడ్ నవాబ్ (వీరేంద్ర సెహ్వాగ్) దీనిని ఎప్పుడో ఆడాడు అని కామెంట్స్ చేస్తున్నారు. టెస్టు క్రికెట్ లో ఒక్కరోజే డబుల్ సెంచరీ చేసిన వీరూను చూసిన మాకు.. ఈ బ్యాజ్‌బాల్ ముచ్చట్లు చెప్పొద్దంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.