Vedic pandits Cricket: ధోతి, కుర్తాలు వేసి క్రికెట్ ఆడుతున్న వైదిక పండితులు.. కామెంట్రీ కూడా సంస్కృతంలోనే..

By Srinivas MFirst Published Jan 20, 2022, 1:40 PM IST
Highlights

Vedic pandits Cricket In Bhopal: అక్కడ క్రికెట్ ఆడాలంటే కాస్ట్లీ ప్యాంట్లు, ఎంపీఎల్ టీషర్టులు వేసుకుని వెళ్తే గ్రౌండ్ లోకి కాదు కదా.. ఆ పరిసరాలలోకి కూడా అడుగుపెట్టనీయరు. కింద ధోతి, పైన కుర్తా పైజామా ఉండాల్సిందే. అలా ఉంటేనే ఎంట్రీ.. 
 

కొత్త కొత్త జెర్సీలు... నైకీ, అడిడాస్ షూలు.. రేబాన్ గ్లాసులు.. కాస్ట్లీ క్యాపులు.. అబ్బో..!! క్రికెట్ ఆటలో మన స్టార్లు ధరించే వస్త్రాభరణాలు అన్నీ ఇన్నీ కావు. అంతర్జాతీయ మ్యాచులు కాకపోయినా సాధారణంగా మనం గల్లీ క్రికెట్ ఆడినా జీన్స్ లో కాకుండా  పరుగెత్తడానికి వీలుగా ఉంటే  ప్యాంటులు, టీ షర్టులు వేసుకుని ఆడతాం. కానీ భోపాల్ లో నిర్వహిస్తున్న ఓ టోర్నీలో మాత్రం అవన్నీ నిషిద్ధం. అక్కడ క్రికెట్ ఆడాలంటే కింద ధోతి, పైన కుర్తా పైజామా ఉండాల్సిందే. అలా ఉంటేనే క్రికెట్ ఆడనిస్తారు. ఇంతకీ అక్కడ ఆడేది ప్రొఫెషనల్ క్రికెటర్స్ అనుకుంటున్నారేమో.. అస్సలు కాదు. పురాణాలు అవపోసన పట్టి.. వేదాలను వడబోసిన వైదిక పండితులు. ఇందులో ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. మ్యాచులకు కామెంట్రీ అంతా సంస్కృతంలోనే.. ఇంగ్లీష్ మాటెత్తితే అంతే సంగతులు...  

మీరు విన్నది నిజమే. అదేంటి.. వేదాలు అభ్యసించే పండితులు క్రికెట్ టోర్నీ ఆడటమేంటి అనేగా మీ   డౌటానుమానం. అయితే ఇది చదవాల్సిందే. వాళ్లు చేస్తున్నది కూడా ఒక సత్కార్యం కోసమే.. 

 

మధ్యప్రదేశ్ లోని భోపాల్ వేదికగా గతేడాది నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు సంస్కృత్ బచావో మంచ్ నిర్వాహకులు. ప్రముఖ భారతీయ యోగా గురువు మహర్షి మహేశ్ యోగి జయంతి సందర్భంగా భోపాల్ లోని అంకుర్ గ్రౌండ్ లో దీనిని నిర్వహిస్తారు.  నాలుగు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో.. వైదిక కుటుంబాలలో  క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ముఖ్యోద్దేశం. వైదిక కర్మలు చేసే వారే  ఈ టోర్నీలో క్రీడాకారులు.  వైదిక పండితుల టోర్నీ అంటే ఇదేదో మన గల్లీల్లో ఉండే చిన్న చిన్న మ్యాచులు అనుకునేరు. ప్రొఫెషనల్ క్రికెట్ లో ఉండే రూల్సన్నీ ఈ టోర్నీలో కూడా ఉంటాయి. ఈ టోర్నీలో ప్రతి మ్యాచుకు మ్యాన్ ఆప్ ది మ్యాచ్, ట్రోఫీ మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ది ట్రోఫీ కూడా బహుకరిస్తారు.  అయితే ఆ  బహుమతులు ఏంటంటే... నగదు రూపకంగాను అంతేగాక వేద పుస్తకాలు, వంద సంవత్సరాల పంచాంగం.. 

కాగా ఈ టోర్నీ నిర్వహణపై సంస్కృత బచావో మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారీ మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీలో ఆటగాళ్లు వేద కర్మలు చేసేవాళ్లు. భారతీయ సంప్రదాయ వస్త్రధారణలైన ధోతి,  కుర్తా వేసుకుని ఇందులో ఆడతాము. ఆటగాళ్లంతా ఒకరితో ఒకరు సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. మ్యాచ్ వ్యాఖ్యానం (కామెంట్రీ) కూడా సంస్కృతంలోనే సాగుతుంది..’ అని అన్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aaj Tak (@aajtak)

మరి ధోతీలు వేసుకుని పరుగులు చేయడం, సిక్సర్లు కొట్టడం, ఫీల్డింగ్ చేయడం కష్టంగా ఉంటుంది కదా అని ఆయనను ప్రశ్నించగా తివారీ స్పందిస్తూ.. ‘ఎందుకు కష్టం. మాకు ఎలాంటి సమస్య లేదు. నేను ధోతీ కట్టుకుని  సిక్సర్లు, ఫోర్లు కూడా కొట్టాను..’ అని తెలిపారు.  పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి కొట్టుకుపోతున్న వారికి సంస్కృతం, దాని ప్రశస్తిని గురించి తెలియజెప్పేందుకే  ఆ భాషలో కామెంట్రీ చెప్పడం, ఆటగాళ్లు మాట్లాడుకోవడం వంటివి చేస్తున్నామని ఆయన వివరించారు.

click me!